వరద నష్టం భారమంతా రాష్ట్రంపైనే!

  • కేంద్రం తక్షణ సాయం ప్రకటించినా అధికారికంగా అందని సమాచారం 
  • వర్షాలు, వరదల వల్ల రూ.10,320 కోట్ల నష్టం 
  • కేంద్ర సాయం రూ.1,500 కోట్లు కూడా దాటదని అంటున్న ఆఫీసర్లు 
  • నిబంధనలు మార్చాలని రాష్ట్ర సర్కార్ డిమాండ్
  • ఇటీవల ఆర్థిక సంఘానికి, కేంద్ర బృందానికీ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతున్నది. తక్షణ సాయం అందిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించినప్పటికీ, దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల రూ.10,320 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే విషయాన్ని కేంద్ర బృందాలకు తెలిపింది. కేంద్రం నుంచి వచ్చిన రెండు బృందాలు కూడా వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. నష్టం భారీగానే జరిగిందని పేర్కొన్న కేంద్ర బృందాలు.. కానీ ప్రస్తుతమున్న నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే నష్ట పరిహారం కింద వచ్చే మొత్తం చాలా తక్కువే ఉంటుందని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన దాంట్లో 15 శాతం మేరనే వచ్చే అవకాశం ఉంటుందని సూచనప్రాయంగా చెప్పినట్టు తెలుస్తున్నది. దీంతో వరద నష్ట భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది. 

గతంలోనూ ఇంతే... 

రాష్ట్రంలో గతంలోనూ భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందాలు పరిశీలించాయి. ఇలా రెండుసార్లు రాష్ట్రానికి వచ్చినప్పటికీ,  ఒక్క పైసా సాయం మాత్రం చేయలేదు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారనే చర్చ జరుగుతున్నది. అందుకే తగ్గట్టే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఎస్​డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. 

పైగా గతంలో ఇచ్చిన నిధుల ఖర్చుకు సంబంధించి యూసీలు ఇస్తేనే, కొత్త నిధులు జమ చేస్తామంటూ కొర్రీలు పెడుతున్నారు. దీంతో వరద నష్టం మొత్తం రాష్ట్రం మీదనే పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు మార్చాలని, ఖర్చు చేసే మార్గదర్శకాల్లోనూ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. దీనిపై ఇటీవల రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర బృందాలతో జరిగిన సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

రూల్స్ పేరుతో కొంతనే సాయం.. 

కేంద్ర నిబంధనల ప్రకారం 33 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం ఇవ్వాలి. అందులో వర్షాధార పంటలకైతే ఎకరాకు రూ.3,400.. వరి లాంటి సాగు నీటి పంటలకైతే ఎకరాకు రూ.6,800 ఇవ్వాలి. ఒకవేళ పంట పూర్తిగా దెబ్బతింటేనే ఈ మొత్తం ఇస్తారు. లేదంటే కనిష్టంగా ఎకరాకు రూ.2 వేలే ఇవ్వాలనే నిబంధన ఉంది. ఇక ఇసుక మేటలు పడితే ఈ మొత్తం ఇంకా తగ్గుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇలాంటి నిబంధనల జోలికి వెళ్లకుండా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ సాయం చేస్తున్నది. వరద బాధిత కుటుంబాలకు రూ.16,500 ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇండ్లు దెబ్బతిన్న, కూలిపోయినా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. నిబంధనల ప్రకారమైతే ఇండ్లు కూలిపోతే రూ.1.20 లక్షలు, దెబ్బతింటే రూ.6,500 మాత్రమే ఇవ్వాలి. ఇక రోడ్ల విషయానికొస్తే ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి రూ.లక్ష ఇవ్వాలని నిబంధన ఉంది. కానీ ఇవి ఏమాత్రం సరిపోవు. రాష్ట్రంలో వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని, రూ.7,693 కోట్ల నష్టం వాటిల్లింది. 

తక్షణ సాయం వచ్చేది డౌటే? 

రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ కింద ఇస్తున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. అయితే ఇవి కొత్తగా కేంద్రం ఇస్తున్న నిధులా? లేక గతంలో వచ్చిన విపత్తు నిధులేనా? అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ కొత్తగా ఇస్తే ఇందులో తెలంగాణకు ఎంత? అనే దానిపైనా క్లారిటీ లేదు. విపత్తు సాయంపై కేంద్రమంత్రుల నుంచి వచ్చిన స్టేట్​మెంట్లు కూడా భిన్నంగా ఉన్నాయి. గతంలో ఇచ్చిన ఎస్డీఆర్ఎఫ్​నిధులను ఖర్చు చేసినట్టు యూసీలు ఇస్తేనే, కొత్తగా నిధులు ఇస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. దానికి అనుగుణంగా ఇటీవల కేంద్రం తెలుగు రాష్ట్రాలకు చేసిన తక్షణ విపత్తు సాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. అయితే నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. 

ఆ తర్వాత వారు ఇచ్చే రిపోర్ట్​కు అనుగుణంగా నిధులు వస్తాయని అధికారులు అంటున్నారు. కానీ ఆ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆ పరిహారం కూడా గతంలో ఇచ్చిన విపత్తు నిధుల నుంచే వాడుకోవాలని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విపత్తు నిధులను పక్కదారి పట్టించిందని కేంద్రం అంటున్నది. ఆ నిధులకు సంబంధించి యూసీలు ఇవ్వాలని కోరుతున్నది. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన రూ.550 కోట్లు నిలిపివేసింది. దీంతో కేంద్రం నుంచి తక్షణ సాయం వస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.