బోయల చరిత్రంతా రాజుల, రాణుల పల్లకి మోతలో, నేటి ఆధిపత్య కులాల రాజకీయ నాయకుల సేవలో నలిగిపోయింది. నాడు బోయ జాతిని కాపాడుకోవడానికి ఉద్యమించిన బోయ నాయకుడు కట్టెం వీరనబోయిన తొలితరం ప్రతినిధి ఎడమ ముంజేతిని, ఎడమ చెవి సగభాగాన్ని యుద్ధాల్లో పోగొట్టుకున్నాడు. తన హక్కుల, ఆత్మగౌరవం కోసం. నేటి బోయలు కనీసం తమకు కావలసిన ఎస్టీ రిజర్వేషన్లు సాధించుకోలేని జాతిగా ముద్రపడింది. తన అస్తిత్వం కోసం వేటనే ఆయుధంగా, వృత్తిగా తీసుకొని అత్యంత క్రూరమైన జంతువులను తన విలువిద్య నైపుణ్యంతో పోరాడి ఆహారాన్ని సంపాదించి తన కుటుంబానికి పంచిన వాడు బోయవాడు. కానీ నేడు బోయలు ఎస్టీ రిజర్వేషన్ కోసం, తాము గెలవగలిగే స్థానంలో కనీసం ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా పోరాడలేకపోతున్నరు.
గద్వాల నియోజకవర్గంలో 45% జనాభా ఉన్న బోయలు కీలకమైన రాజకీయ పదవులను అందుకోలేకపోతున్నారు. ఒక్క గద్వాల నియోజకవర్గంలో దాదాపు 2,40,000 వేల ఓట్లలో దాదాపు 80 వేల ఓట్లు ఒక్క బోయ కులానివే. కానీ ఎమ్మెల్యే పదవి, అధికారం మాత్రం అగ్రకులాల వారింట్లో ఉంటుంది. బోయలను రాజ్యాధికారం వైపు రాజకీయ చైతన్యం కాకుండా, ఎస్టీ రిజర్వేషన్ఇవ్వకుండా అడ్డుకుంటున్నది ఎవరు ? తరతరాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే గద్వాల నియోజకవర్గాన్ని పాలిస్తూ అగ్రకుల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన ఓటుబ్యాంకు కలిగిన గద్వాల. వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, మక్తల్ నియోజకవర్గాల్లో ఒంటరిగానే బోయలు పోటీచేయాలె.
గద్వాల బోయలదే
మెజార్టీ జనాభా ఉన్న గద్వాలలో బోయలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్న విజ్ఞత ఏ పార్టీకీ లేదు. కేవలం ఒకే ఒక కులం ఓటుతో గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గద్వాల మాత్రమే. అలాంటి అవకాశాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా బోయలకు ఇస్తే సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. కానీ కేవలం ఐదు శాతం ఉన్న ఓసీలకు లేదంటే బోయల కంటే తక్కువ జనాభా ఉన్న కులానికి టికెట్ కేటాయించడంతో పార్టీలు మెజార్టీ వర్గాలను రాజకీయ ప్రతినిధులుగా కంటే ఓటు బ్యాంకుగానే చూసి రాజకీయ అవకాశాలు దూరం చేస్తూ ఇతరులకు కొమ్ముకాస్తున్నాయి. నడిగడ్డ బోయలు ఈ రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలి. బోయలను కాదని ఇతరులకు టికెట్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో బోయ జాతి తెగువను వచ్చే ఎన్నికలలో చూపించాలి.
ఎందులోనూ ఎదగలె
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రత్యేక తెలంగాణలో కూడా అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా ఏదంటే గద్వాలనే గుర్తుకొస్తుంది. బోయలకు విద్యను అందించకుండా వారిని ఫ్యాక్షనిజం వైపు మళ్లించి కేవలం పార్టీ జెండాలు పట్టుకుని తిరిగే జాతిగా చూస్తున్నారు. ఇక్కడ బోయల జీవనం విధానం, అక్షరాస్యత, ఆర్థిక స్థితిగతులు దళితుల కంటే బాగా వెనకబడిపోయింది అనేకంటే అలానే ఉంచాలనే విధంగా పాలన పనితీరు ఉన్నది. రాజకీయలకు,విద్యకు, కుటుంబలకు దూరమైపోయి ప్రాణాలు పోయిన వారు ఎందరో. అలా అని అగ్రకులాల కింద పనిచేస్తున్న క్రమంలో సొంతంగా బోయలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య పరంగా ఎదిగారా అంటే అదీ లేదు. అత్యంత దీనమైన పరిస్థితుల్లో జీవన విధానం నేటికీ కొనసాగుతూనే ఉంది.
కేసీఆర్ మోసం
గద్వాల నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి 1999 నుంచి 2004 వరకు మొట్టమొదటిసారి నారా చంద్రబాబు నాయుడు చోరువతో తెలుగుదేశం పార్టీ నుంచి గట్టు భీముడికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఒక బలమైన లీడర్ గా ఏ ఒక్క బోయ జాతి బిడ్డ రాలేకపోయాడు. ఆ సాహసం, ధైర్యం చేసి పోరాడి రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగే నాయకుడు రాలేదు. గతంలో కేసీఆర్ గద్వాల, వనపర్తి పర్యటన సందర్భంలో అడ్డుకున్న సందర్భంలో బోయలకు మళ్లీ అవకాశం ఇస్తానని వారిని ఎస్టీలో చేరుస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. కెటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు కూడా బోయలకు ఏదో చేస్తామని భ్రమ కల్పించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారి మాయమాటలతో ఈసారి మోసం చేయలేరని వచ్చే ఎన్నికల్లో బోయలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, మక్తల్, దేవరకద్ర, మహబూబ్నగర్, నారాయణపెట్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలో బోయల ఓటు బ్యాంకు విస్తరించి ఉంది. బోయల ఎస్టీ రిజర్వేషన్ కు స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని, బోయలను ఎస్టీలో చేరుస్తామని కపట నాటకమాడుతూ బోయల పట్ల ద్వందనీతిని ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్కు మాత్రం ఓటు వెయ్యబోమని శపథం చేస్తున్నారు. లక్ష రూపాయల బీసీ బంధులో బోయలకు కనీసం అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. వారి సంక్షేమానికి కార్పొరేషన్ కూడా లేదు. అనేక ప్రభుత్వ పథకాలకు దూరం చేసి బోయలను మనుషులుగా కూడా గుర్తించని కేసీఆర్కు ఈ ఎన్నికల్లో బోయల నుంచి గుణపాఠం తప్పదేమో!
అది బోయల కోట
గద్వాల నియోజకవర్గం బోయల కంచుకోటగా మారాల్సిన అవసరం ఉంది. అగ్రకులాల గడిలో బందీ అయిన "బోయల గద్వాల" ను విముక్తి చేయలంటే బోయలు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోరాటం చేసి హస్తగతం చేసుకోవాలె. అప్పుడే బోయల ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని నిలబడే గౌరవంతో బోయలను విద్య, ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో నడిపించాలె. ఇతర బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీలను కలుపుకొని అన్ని వర్గాలు అభివృద్ధి చెందేటట్లు వారి పోరాటం ఉండాలె. బోయలు పల్లకిలనే కాదు పాలన బాధ్యతలను కూడా జాగ్రత్తగా మోయగలరని చాటాలె.
- డా. రేమద్దుల మండ్ల రవి, ఉస్మానియా యూనివర్సిటీ