గద్వాల, వెలుగు: బీఆర్‌ఎస్ పార్టీలో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొన్ని చోట్ల ఆ హామీ అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి ఆ పార్టీలో చేరడంతో సమీకరణాలు మారనున్నాయి. నియోజకవర్గంలో చల్లా బలమైన లీడర్ కావడంతో బీఆర్ఎస్ హైకమాండ్ వ్యూహాత్మకంగానే గులాబీ కండువా కప్పింది. అయితే ఆయన అలంపూర్ టికెట్ తానుచెప్పిన వారికి ఇవ్వడంతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ సీటు గానీ కొల్లాపూర్ ఎమ్మెల్యే సీటు గానీ తనకు ఇవ్వాలని కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం హైదరాబాదులోనే ఉన్నా.. ఆయనకు సమాచారం ఇవ్వకుండా మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి కలిసి చల్లాను సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేర్పించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
2004లో ఇండిపెండెంట్‌గా విజయం
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురు కొడుకు) అయిన చల్ల వెంకట్రాంరెడ్డి అలంపూర్ నియోజవర్గంలో బలమైన నేత. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన భంగపడ్డ ఆయన ఇండిపెండెంట్‌గానే బరిలో నిలిచి గెలుపొందారు. 2009లో సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడ్ అయ్యాక కాంగ్రెస్ భీ పామ్ ముందు సంపత్ కుమార్‌కు కన్ఫాం అయ్యింది. కానీ, చల్లా దాన్ని క్యాన్సల్ చేయించి డాక్టర్ అబ్రహంకు టికెట్ ఇప్పించి గెలిపించారు. 2014 ఎన్నికల్లో సంపత్ కుమార్ చల్లా మద్దతుతోనే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సంపత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం గెలిచారు. అప్పటి నుంచి చల్లా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. క్యాడక్‌కు మాత్రం అందుబాటులోనే ఉండేవారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయనకు కార్యకర్తలు ఉన్నారు.
నాలుగేళ్లుగా పార్టీ మారుతారనే ప్రచారం
2019 ఎన్నికల తర్వాత చల్ల వెంకట్రామిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నా.. పార్టీ మారుతారని చాలా సందర్భాల్లో ప్రచారం జరిగింది. కానీ, ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. ఒక సందర్భంలో అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరిగినా.. ఆయన చేరలేదు. కానీ, సడన్‌గా రెండు రోజుల కింద బీఆర్‌ఎస్‌లో చేరడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సీక్రెట్‌గా క్యాడర్‌తో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలసింది.
కాంగ్రెస్‌కు బిగ్ షాక్
చల్లా వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్‌ను వీడడం ఆ పార్టీకి కొలుకోలేని దెబ్బేనని నాయకులు అంటున్నారు. నియోజకవర్గంలో సగానికిపైగా ఆయనకు సంబంధించిన క్యాడరే ఉంది. వాళ్లంతా ఇప్పుడు చల్లా వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారనుంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఇన్నాళ్లు చల్లానే నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
రూట్ క్లియర్ చేసుకున్న మినిస్టర్
చల్లా వెంకట్రాం రెడ్డి బీజేపీ చేరి వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్ అయిన మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరాలని చల్లాతో మూడు నెలలుగా చర్చలు జరుపుతున్నారు. ఆయన పెట్టిన కండీషన్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించి హామీ ఇచ్చాకే పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. ఇలా తన రూటును క్లియర్ చేసుకోవడంతో పాటు నడిగడ్డలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది.
సిట్టింగ్‌కు కష్టమే..
బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో 5గురు టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రోగ్రాములు కూడా వ్యక్తిగతంగానే కానిస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వర్గ విభేదాలు బయటపడ్డాయి. తాజా చల్లా వెంకట్రాం రెడ్డి ఎంట్రీ తో ఆశావహుల ఆశలు గల్లంతేనని చర్చ జరుగుతున్నది. ఆయన ఎవరికి మద్దతిస్తే వారే గెలుస్తారని క్యాడర్‌తో పాటు ప్రజలు కూడా చెబుతున్నారు.