నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్ పారిశుధ్య కార్మికుడి అవతరమెత్తాడు. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగడంతో గ్రామాల్లోని చెత్తా, చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీంతో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న తానే పారిశుధ్య కార్మికుడిగా మారి.. ట్రాక్టర్ నడుపుతూ వీధి వీధి తిరుగుతూ చెత్తను సేకరించాడు. పంచాయతీ సిబ్బంది తమను పర్మినెంట్ చేస్తూ కనీస వేతనం 19 వేలు చెల్లించాలంటూ జులై 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.
మరోవైపు.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సర్పంచ్ ఆరెపల్లి మహదేవ్ గౌడ్ కూడా సోమవారం (జులై 10న) చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. జీపీ కార్మికులు సమ్మెతో కొద్ది రోజులుగా గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోయింది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడం, వర్షాకాలంలో గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ చెత్తను సేకరించి.. తరలించారు. సర్పంచ్ ను పలువురు అభినందించారు.