ఆక్వాహబ్​ ఏర్పాటు స్థల సేకరణ వద్దే నిలిచిపోయింది

ఆక్వాహబ్​ ఏర్పాటు స్థల సేకరణ వద్దే  నిలిచిపోయింది

రాజన్న సిరిసిల్ల, వెలుగు: మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఆక్వాహబ్​ ఏర్పాటు పనులు స్థల సేకరణ వద్దే  నిలిచిపోయాయి. మిడ్ మానేరు కేంద్రంగా ఆక్వాహబ్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ గతేడాది ప్రకటించారు. అక్వా హబ్​ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు, అన్నపూర్ణ అనంతగిరి, నర్మాల అప్పర్ మానేరు ప్రాజెక్ట్ లు పూర్తిగా నిండాయి. వీటితో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. దీంతో మిడ్ మానేరు కేంద్రంగా 10వేల మందికి ఉపాధి కల్పించేందుకు మంత్రి కేటీఆర్ అక్వాహబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఏడాది కాలంగా నిర్మాణ ప్రక్రియ స్థల సేకరణ వద్దే ఆగింది. 

రూ.2వేల కోట్లు.. 367 ఎకరాలు

శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు కేంద్రంలో  మత్స్య పరిశ్రమ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడితో 367 ఎకరాల విస్తీర్ణంలో  ఆక్వాహబ్ ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు స్థల సేకరణ చేశారు. చింతలఠానా, చీర్లవంచ గ్రామాల వద్ద ఉన్న ప్రభుత్వ భూమితో పాటు కొంత ప్రైవేటు స్థలాన్ని సేకరించారు.  భూములు కోల్పోయిన వారికి  నష్టపరిహారం  కూడా అందజేశారు. 1987 లో ప్రభుత్వ స్థల పొందిన నిర్వాసితులుకు రూ. 4.80 లక్షల చొప్పున, ప్రైవేటు స్థలం నిర్వాసితులకు రూ.9.80లక్షల చొప్పున  పరిహారం అందించారు. త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు తేదీలను ప్రకటిస్తామని ఆఫీసర్లు చెప్పారు. మిడ్ మానేరు వద్ద  600యూనిట్లు ఏర్పాటు చేస్తే 10వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అమెరికా కు చెందిన ఫిషరీస్ ఫిషింగ్ కంపెనీ, దేశీయ ఫ్రెష్ టు హోం, ఆనందా గ్రూప్, సీపీ అక్వా గ్రూప్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో జిల్లా మత్స్యకారుల్లో ఆశలు చిగురించాయి.

నాలుగు నెలల కింద హడావుడి

మిడ్ మానేరులో చీర్లవంచ సమీపంలో అక్వాహబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఆఫీసర్లు హడావుడి చేశారు. ఫిషరీస్ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఏర్పాట్లు పరిశీలించారు. త్వరలోనే శంకుస్థాపన తేదీలను ప్రకటిస్తామని అనౌన్స్ కూడా చేశారు. కానీ నాలుగు నెలల నుంచి వాయిదా పడుతూనే ఉంది. భూ సేకరణ ఏడాది పడితే అక్వాహబ్ పనులు నిర్మాణానికి చాలాకాలం పడుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పనులు ప్రారంభించాలి 

మిడ్ మానేరులో అక్వాహబ్ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఏడాది కింద ప్రకటించారు. కాని ఇప్పటి వరకు పనులు స్టార్ట్​ కాలేదు. భూ సేకరణ పూర్తయింది. ఆక్వాహబ్ నిర్మాణం పూర్తయితే ముదిరాజ్ లకు ప్రాధాన్యం ఇవ్వాలి. - రెడ్డివేని రాజు ముదిరాజ్, మత్స్యకారుడు 

త్వరలో పనులు స్టార్ట్​ చేస్తాం

జిల్లాలో మిడ్ మానేర్ కేంద్రంగా ఆక్వాహబ్ ఏర్పాటు కోసం భూసేకరణ పూర్తయింది. త్వరలోనే పనులు స్టార్ట్​చేస్తాం. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అక్వాహబ్ ప్రక్రియ జరుగుతోంది.  టీఎస్ఐఐసీ టెండర్లను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

- ఆర్డీవో శ్రీనివాస్ రావు, సిరిసిల్ల