భద్రాచలం, వెలుగు:శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు ముందుకు సాగడం లేదు. దేవస్థానంతో ఒప్పందం చేసుకున్న సన్ టెక్నాలజీస్ సంస్థ ఇంకా పనులు షురూ చేయకపోవడంతో మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. విడతల వారీగా అవసరమైన పరికరాలను పంపుతోంది. పనులు రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సోలార్ వెలుగులు కలిగిన ఏకైక గుడిగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో రికార్డులకెక్కుతుంది. కానీ నేటికీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. విదేశాల నుంచి వస్తున్న సోలార్ పరికరాలపై కేంద్రం ఇటీవల ట్యాక్స్ పెంచడమే ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమని చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే సోలార్ ప్లేట్లు భద్రాచలానికి సంస్థ పంపించింది. త్వరలో పనులు స్టార్ట్ చేస్తామని చెప్తోంది.
2020లో ప్రారంభించినా..
ఆర్టీసీలో సోలార్ ప్రాజెక్టు నిర్వహిస్తున్న సన్టెక్నాలజీస్ 2020లో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కూడా వెలుగులు అందించేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్‌ను దేవస్థానం ఎండోమెంట్ కమిషనర్ అనుమతి కోసం పంపించింది. ఏడాది తర్వాత 2021లో కమిషనర్ నుంచి అనుమతి వచ్చింది. రామాలయంతో పాటు 27 కాటేజీలు, 140 రూమ్‌లు, నిత్యాన్నదాన సత్రం తదితర అన్ని చోట్ల సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు సన్టెక్నాలజీస్తో దేవస్థానం ఒప్పందం చేసుకుంది. 25 ఏళ్లపాటు ఒకే ధరతో కరెంట్ ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది. కిలో వాట్ నుంచి 10 కిలో వాట్ వరకు యూనిట్‌కు రూ.5.80, 11 కిలో వాట్స్ నుంచి 100 కిలోవాట్ల వరకు యూనిట్‌కు రూ.5.50, 100 కిలోవాట్లు దాటితే యూనిట్ రూ.4.80లు చొప్పున సంస్థకు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. ప్రస్తుతం దేవస్థానం నెలకు రూ.7 లక్షల చొప్పున ట్రాన్స్ కోకు బిల్లులు చెల్లిస్తోంది. సోలార్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దేవస్థానానికి 40 శాతం బిల్లులు ఆదా అవుతాయి.
సంప్రదింపులుజరుపుతున్నాం
సోలార్ ప్రాజెక్టు విషయంలో సన్ టెక్నాలజీస్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. మెటీరియల్ పంపారు. సోలార్ ప్యానెల్స్, బోర్డులు, ఇతర వస్తువులు అన్నీ వచ్చాయి. వాళ్ల స్టాఫ్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో కాస్త ఆలస్యం అవుతోంది. త్వరలోనే పనులు మొదలవుతాయి.
- రవీందర్‌రాజు, దేవస్థానం ఈఈ