మార్కెట్ కమిటీ చైర్మన్​ పదవికి ఎగ్జామ్..రాజకీయాల్లో కొత్త ట్రెండ్​

మార్కెట్ కమిటీ చైర్మన్​ పదవికి ఎగ్జామ్..రాజకీయాల్లో కొత్త ట్రెండ్​
  • కామారెడ్డి జిల్లా మద్నూర్​లో టెస్ట్  పాసై ఎంపికైన సౌజన్య
  • అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ​
  • ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నిర్ణయం బాగుందని ప్రశంస

కామారెడ్డి/పిట్లం, వెలుగు : రాజకీయాల్లో కొత్త ట్రెండ్​ మొదలైంది. నామినేటెడ్​ పోస్ట్​ అయిన మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవికి తొలిసారిగా ఎగ్జామ్​ నిర్వహించారు. ఇందులో మెరిట్​సాధించిన యువతిని ఏఎంసీ చైర్​పర్సన్​గా నియమించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతోపాటు ప్రతిభ ఉన్న వారికి పదవి కట్టబెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్​ పోస్ట్​కు కామారెడ్డి జిల్లా జుక్కల్​ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు  మౌఖిక పరీక్ష నిర్వహించి, సరికొత్త ట్రెండ్​కు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​  పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్​ అయింది. 

దీని  పరిధిలో మద్నూర్, జుక్కల్, డొంగ్లి మండలాలు ఉంటాయి.  పదవి కోసం అధికార కాంగ్రెస్​కు చెందిన పలువురు పోటీ పడ్డారు. అయితే, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు  భిన్నంగా అలోచించారు.  నామినేటెడ్​ పోస్టు భర్తీ కోసం ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.  3 మండలాల కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్లు,  మరో ముగ్గురు సీనియర్​ లీడర్లను కమిటీలో మెంబర్లుగా నియమించారు.  వీరందరి సహకారంతో క్వశ్చన్​ పేపర్ తయారు చేశారు. 15 రోజుల క్రితం మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవి కోసం మౌఖిక పరీక్ష నిర్వహించారు.  దీనికి 15 మంది హాజరయ్యారు.  

ఎమ్మెల్యేతో పాటు కమిటీ సభ్యులు ఆరుగురు కలిసి ఇంటర్వ్యూ చేశారు.  రాజకీయం,  వ్యవసాయం, స్థానిక ఆంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ పరీక్షలో  ఎమ్మెస్సీ బీఈడీ చదివిన జుక్కల్​ మండలం పెద్ద ఎడ్డికి చెందిన అయిల్వార్​ సౌజన్య పాసయ్యారు.  మౌఖిక పరీక్షలో ఈమెకు మిగతా వారి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి.  దీంతో ఈమెను మార్కెట్ కమిటీ  పదవి  వరించింది.  కాగా,  బుధవారం సౌజన్య, నియోజక వర్గ లీడర్లతో  ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు హైదరాబాద్​లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని కలిశారు. 

ఈ సందర్భంగా రాజకీయాల్లో కొత్త ట్రెండ్​కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేను మంత్రి అభినందించారు. లక్ష్మీకాంతరావు నిర్ణయం చరిత్రాత్మకమని ప్రశంసించారు. ప్రతీ ఎమ్మెల్యే ఇలాంటి ప్రయత్నం చేస్తే.. రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు.   రైతులతో పాటు  ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని సౌజన్య పేర్కొన్నారు. 

రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే.. 

రాజకీయాలతోపాటు స్థానికంగా పాలనలో మార్పు తీసుకురావాలనేది నా ఉద్దేశం. చదువుకున్న వారిని ప్రోత్సహించి పదవులు కట్టబెడితే వారు ప్రజలకు మంచి సేవ చేయగలుగుతారు.  జుక్కల్​ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం.  గతంలో నామినేటెడ్​ పోస్టులు వచ్చిన  భార్యల స్థానంలో భర్తలు పెత్తనం చేసేవారు. ఈసారి అలాకాకుండా.. చదువుకున్నోళ్లకు.. అవగాహన ఉన్నోళ్లకే పదవి ఇవ్వాలని నిర్ణయించా. 

రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని భావించి మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​​ పదవి కోసం మౌఖిక పరీక్ష నిర్వహించా.  ఇష్టమొచ్చినోళ్లకు కాకుండా.. ప్రతిభ చూపినోళ్లకే పదవి ఇచ్చినం. - లక్ష్మీకాంతరావు, జుక్కల్​ ఎమ్మెల్యే