- జీహెచ్ఎంసీలో తక్కువగా.. బయట ఎక్కువగా
- చదరపు గజం మినిమం వ్యాల్యూ రూ.500
- వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.లక్షన్నర
- కలెక్టర్ల వద్దకు చేరిన రిపోర్టులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ వ్యాల్యూ పెంపుపై కసరత్తు పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే మార్కెట్ వ్యాల్యూ కాస్త ఎక్కువగా ఉన్నందున తక్కువ పెంచడంతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కువగా పెంచినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా మున్సిపాలిటీలు, పంచాయతీలకు సంబంధించిన అన్నిరకాల భూముల విలువలు, ఫ్లాట్ల విలువలను అధికారులు ఖరారు చేసి గురువారం కలెక్టర్లకు పంపారు. శుక్ర, శనివారాల్లో వారి ఆమోదం అనంతరం కొత్త మార్కెట్ వ్యాల్యూస్ను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ వ్యాల్యూను ప్రస్తుతం ఉన్న వ్యాల్యూపై మినిమం 20 శాతం నుంచి మ్యాగ్జిమం 100 శాతం వరకు పెంచబోతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని ఖరీదైన ప్రాంతాల్లో మార్కెట్ విలువలు రెండు, మూడు రెట్లు పెరిగే అవకాశముంది. రాష్ట్రంలో ఎక్కడైనా చదరపు గజం విలువ రూ.500గా, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కు సంబంధించి చదరపు అడుగు (స్క్వైర్ ఫీట్) వ్యాల్యూను రూ.1300గా, వ్యవసాయ భూముల మార్కెట్ వ్యాల్యూను ఎకరం రూ. లక్షన్నరగా నిర్ణయించినట్లు తెలిసింది. వ్యవసాయ భూముల విలువలు ఏరియాను బట్టి ప్రస్తుతం ఉన్న విలువపై మినిమం 50 శాతం నుంచి మ్యాగ్జిమం 100 శాతం వరకు పెంచబోతున్నట్లు సమాచారం.