
బషీర్‌బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 46 రోజులుగా కొనసాగుతున్న ‘నుమాయిష్’ సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో సందర్శకులు భారీగా తరలివచ్చారు. స్టాళ్లన్నీ చుట్టేసి నచ్చిన వస్తువులు కొనుకున్నారు. ముగింపు సభలో బెస్ట్ స్టాల్ నిర్వాహకులను, అధికారులను ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు సన్మానించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.
నుమాయిష్ ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ ఏడాది వచ్చిన ఆదాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేలా, విద్యా సంస్థలు స్థాపించేలా సహకరిస్తామని చెప్పారు. ముగింపు సభలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, శాట్స్ చైర్మన్ శివ సేనారెడ్డి, తెలంగాణ మైనారిటీస్ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ చైర్మన్ ఫయిమ్ ఖురేషి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీవ్ , ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు నిరంజన్, సురేందర్ రెడ్డి, డి.మోహన్, ప్రభాశంకర్, రవి యాదవ్ పలువురు పాల్గొన్నారు.
ఈ-వేస్ట్‌పై పీసీబీ క్విజ్
నుమాయిష్‌లోని పీసీబీ స్టాల్లో సోమవారం సందర్శకులకు ఈ-వేస్ట్ పై క్విజ్ నిర్వహించారు. సరైన సమాధానాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. పీసీబీ సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ ఎం.దయానంద్ పాల్గొన్నారు.