ఖమ్మం– విజయవాడ మధ్య నాలుగు లేన్ల యాక్సెస్ ​కంట్రోల్డ్ గ్రీన్​ఫీల్డ్ హైవే

  •     డిసెంబర్​లోనే తొమ్మిది కంపెనీల బిడ్లు దాఖలు  
  •     మొదటి ప్యాకేజీకి రూ.984 కోట్లు మంజూరు 
  •     భూసేకరణకు కొనసాగుతున్న గ్రామసభలు 
  •     మార్కెట్ రేటు ఇవ్వాలంటున్న బాధితులు


ఖమ్మం, వెలుగు: మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి- విజయవాడ వరకు ఎకనామిక్​కారిడార్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఖమ్మం–- విజయవాడ మధ్య నిర్మిస్తున్న ఎక్స్ ప్రెస్​వే పనులు స్పీడందుకున్నాయి. నాలుగు లేన్ల యాక్సెస్​కంట్రోల్డ్ గ్రీన్​ఫీల్డ్ హైవేలో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ను ఆనుకొని వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి మధ్య మొదటి ప్యాకేజీగా త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. 29.92 కిలోమీటర్ల దూరానికి తాజాగా రూ.983.90 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. నేషనల్​హైవే 163(జి)లో భాగంగా ఈ హైవే కంప్లీట్ అయితే ఖమ్మం నుంచి గంటలోపే విజయవాడ చేరుకోవచ్చు. మొత్తం హైవే 90 కిలోమీటర్ల దూరం కాగా, ఖమ్మం జిల్లాలో 60 కిలోమీటర్లు, ఏపీలో 30 కిలోమీటర్ల దూరం ఉంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నిర్మించనున్న ఈ హైవే కోసం డిసెంబర్ లో కేంద్రం టెండర్లను పిలిచింది. మేఘాతోపాటు మరో 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ప్రస్తుతం ఖమ్మం నుంచి విజయవాడకు 130 కిలోమీటర్ల దూరం వస్తోంది. దీని ప్రయాణానికి సుమారు 3గంటల సమయం పడుతోంది. హైవే నిర్మాణమైతే 60 నుంచి 70 నిమిషాల్లోనే విజయవాడ చేరుకోవచ్చు. 

మూడు రాష్ట్రాలకు అనుసంధానం..

నాగ్ పూర్–-- విజయవాడ కారిడార్​మొత్తం దూరం 405 కిలోమీటర్లు. తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా హైవే నిర్మాణం కానుంది. మొత్త రూ.14,666 కోట్లతో దీన్ని ప్లాన్​చేయగా, గ్రీన్​ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అప్​గ్రేడెడ్ సెక్షన్లుగా విభజించారు. 2027లోగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయడం లక్ష్యంగా ఈ హైవేను చేపట్టినట్టు కేంద్రమంత్రి గడ్కరీ చెబుతున్నారు.​ ఇదే ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం నుంచి వరంగల్ హైవే కూడా నిర్మాణం జరుగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​మధ్య రోడ్డు ప్రయాణ సమయాన్ని, దూరాన్ని తగ్గించడంతోపాటు సరకు రవాణా, ఏపీలో ఉన్న పోర్టులను తెలంగాణ, మహారాష్ట్రలకు అనుసంధానం కోసం ఈ ఎక్స్ ప్రెస్​హైవేను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం–-విజయవాడ మధ్య 1098 ఎకరాలు, ఖమ్మం–- వరంగల్ మధ్య 1315 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. అందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. 

భూసేకరణలో చిక్కులు...

ఖమ్మం జిల్లాలో కొణిజెర్ల మండలం గోపతి, చింతకాని మండలం నగిలికొండ, ప్రొద్దుటూరు, బోనకల్​మండలం బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి, పెద్దబీరవల్లి, మధిర మండలం ఆత్కూర్, మాటూరు, నిదాన్​పురం, రొంపిమల్ల, సిరిపురం మీదుగా భూసేకరణ చేస్తున్నారు. అధికారులు ఎకరానికి రూ.20 లక్షలకు పైగా పరిహారంగా వస్తుందని గ్రామసభల్లో చెబుతున్నారు. 
భూములు కోల్పోతున్న బాధితులు మాత్రం తమకు మార్కెట్ రేటును పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ఈ హైవేల నిర్మాణంతో గ్రామాల్లో రూ.50 లక్షల వరకు భూముల ధరలు పెరిగాయని, ప్రభుత్వ ప్రకారమే భూమి సేకరిస్తే తాము నష్టపోతామంటున్నారు. ఆఫీసర్లు మాత్రం కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్ట ప్రకారమే పరిహారం నిర్ణయించామని గ్రామస్తులకు వివరిస్తున్నారు. జిల్లాలో దాదాపు భూసేకరణ చివరి దశకు చేరుకుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.