- అగ్రనేతల డైరెక్షన్లో రూట్ మ్యాప్
- బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలపై ఫోకస్
ఆదిలాబాద్, వెలుగు :ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ పకడ్బందీ ప్లాన్ వేస్తోంది. అగ్రనేతల డైరెక్షన్లో సామాజిక సమీకరణాల పేరుతో స్థానిక నాయకులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ ఆదిలాబాద్ లో జరిపిన పర్యటన ఈ సమీకరణాలకు నాంది పలికింది. ఆదిలాబాద్ లో బలమైన బీసీ సామాజిక వర్గమైన మున్నూరు కాపుల ఓట్ల మీద కమలం నేతలు కన్నేశారు. ఈ నేపథ్యంలో కులంతో పాటు సామాజికంగా పట్టున్న మున్నూరు కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపారు.
ఈ ప్లాన్‌లో భాగంగానే అనుకున్నట్లుగానే ఇక్కడి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కుల, రాజకీయంగా పట్టుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉష్కం రఘుపతి, ఉపాధ్యాయ సంఘ నేతగా గుర్తింపు పొంది, మున్నూరు కాపులో పట్టున్న దారట్ల జీవన్ తో పాటు ఆ వర్గం మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌తో పాటు కుల సంఘాల ముఖ్య నేతలు సైతం పార్టీలోకి రప్పించడం వెనుక ఈ రూట్ మ్యాపే ప్రధాన కారణంమంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మున్నూరు కాపుల ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తాయని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి.
అగ్రనేతల డైరెక్షన్..
పార్టీలో చేరికలపై సీరియస్ గా దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం జిల్లాకు సంబంధించినరూట్ మ్యాప్ సిద్ధం చేసిందని, దీని ప్రకారంగా మొదట మున్నూరు కాపు నేతలను చేర్చుకోవాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత ఇతర బీసీ కులాల నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు బోథ్ నియోజకవర్గంలో మున్నూరు కాపులు,పద్మశాలీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఓట్లు అధికంగా ఉండటంతో వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్..
బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని బీజేపీ దశల వారీగా ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పై తీవ్ర అసంతృప్తి తో ఉన్న బీఆర్ఎస్ నేతలను, అలాగే ఆయన సామాజికవర్గమైన మున్నూరు కాపు కుల సంఘ నేతలన బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోంది. జోగురామన్న కు మొదట్లో సన్నిహితుడైనమ ఉష్కం రఘుపతి కొంత కాలం గా అసంతృప్తితో ఉన్నారు.
ఆయనతో పాటు చాలా మంది సీనియర్ నేతలు స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నట్లు బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని తమకు అనుగుణంగా మలుచుకొని బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. బీసీ కులాల సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చి మరింత బలపడాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే రామన్న కూడా ఇలాంటి సెంటిమెంట్ తోనే బీసీ లలోని మెజార్టీ ఓట్లను తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడా వ్యూహాన్ని బీ ఎమ్మెల్యేపై మున్నూరుకాపు సామాజికవర్గంతో పాటు ఎస్సీ,ఎస్టీ, పద్మశాలీ వర్గాలు అసంతృప్తితో ఉండటం బీజేపీ కలిసొచ్చే అంశమని రాజకీయ వర్గాలు
చెబుతున్నాయి.