ఖమ్మం పట్టణంలో గత నెల ఏప్రిల్ 27వ తేదీన అత్యాచారానికి గురై చనిపోయిన ఓ మహిళ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ అత్తకు వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి వెళ్లి.. ఇంటికి వెళ్తున్న కోడలిపై అఘాయిత్యం చేశాడో ఓ ఆటో డ్రైవర్. దాడి చేసిన తర్వాత 28వ తేదీ ఉదయం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి పారిపోయాడు నిందితుడు. బాధితురాలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు అంటే 28వ తేదీన చనిపోయింది.
మృతి విషయం ఎలా బయటపడింది..?
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చెన్నారావుపేట రామన్నగుట్ట తండాకు చెందిన ఓ మహిళ.. తమ అత్తకు ఆరోగ్యం బాగోలేకపోతే.. వైద్యం చేయించేందుకు ఏప్రిల్27వ తేదీన ఖమ్మం రైల్వేస్టేషన్ కు చేరుకుంది. రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేయించి.. తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు కొత్త బస్టాండ్ కు ఆటోలో వెళ్లారు అత్తాకోడళ్లు. మార్గమధ్యలో అత్తకు మోషన్స్ రావడంతో డ్రైవర్.. తన ఆటోను పక్కకు ఆపాడు. బహిర్భూమి కోసం అత్త వాహనం దిగగానే.. ఇంతలో కోడలిని కిడ్నాప్ చేశాడు ఆటో డ్రైవర్.
మహిళపై అత్యాచారం చేసిన తర్వాత ఆటోడ్రైవర్ ఏప్రిల్ 28వ తేదీన ఉదయం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లాడు. అప్పటికే బాధితురాలి తలకు బలమైన గాయం కావడంతో డాక్టర్లు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించి.. బాధితురాలు 28వ తేదీనే చనిపోయింది. బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు వైద్యులు గుర్తించారు. అయితే.. చనిపోయిన మహిళ వెంట ఎవరూ లేకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ వైద్య సిబ్బంది..డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.
రెండు రోజుల తర్వాత అత్త తమ తండాకు చేరుకొని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు ఖమ్మం వెళ్లారు. మూడు రోజులుగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఖమ్మంలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లితే.. తమ పరిధిలోకి రాదంటే.. తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తమను పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. అయితే...అక్కడ ట్రైనింగ్ లో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతురాలి ఫోటోలను పోలీసులు చూపించారు. దీంతో చనిపోయిన మహిళను బాధితులు గుర్తించారు.
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో పోలీసులు ఉంటే.. ఆ మహిళ బతికి ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు.. ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడు దొరికితేనే ఈ కేసులో చిక్కుముడి వీడే అవకాశాలు ఉన్నాయి.