తూప్రాన్ ఆస్పత్రి వద్ద ఆందోళన

తూప్రాన్ ఆస్పత్రి వద్ద ఆందోళన
  •     డ్రైవర్ ని అప్పగించాలని మృతుల కుటుంబసభ్యులు, బంధువుల డిమాండ్  
  •     డెడ్ బాడీలను తరలించకుండా అడ్డుకుని పోలీసులతో వాగ్వాదం

తూప్రాన్​/శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబసభ్యులు, బంధువులు గురువారం తూప్రాన్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళన చేశారు. డెడ్ బాడీ లను ట్రాక్టర్ లో ఎక్కించకుండా అడ్డుకోగా వాగ్వాదం చోటుచేసుకుంది.  బుధవారం కారు శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద  వాగులో బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.  డెడ్​బాడీలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

అయితే.. ఆస్పత్రి వద్ద  మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రమాదానికి కారణమైన  కారు డ్రైవర్ నాన్ సింగ్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.  మృతురాలు జగ్యా తండాకు చెందిన అనిత భర్త మోహన్,  మేనమామ రమేశ్​మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నాన్ సింగ్ కావాలనే యాక్సిడెంట్ చేసి అందరి ప్రాణాలు తీశాడని ఆరోపించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా

తమకు న్యాయం జరిగే వరకు డెడ్ బాడీ లను తీసుకెళ్లబోమని భీష్మించారు. కొద్దిసేపు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ రంగకృష్ణ, ఎస్ఐ రమేశ్ న్యాయం జరిగేలా చూస్తామని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. అనంతరం డెడ్​బాడీలను తరలించారు. తాళ్లపల్లి తండా, భీమ్లా తండా, జగ్యా తండాలో పోలీస్​ బందోబస్తు మధ్య మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు.