నిర్మల్ జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాల్వ సతీష్ (27) అనే రిమాండ్ ఖైదీ అనారోగ్యంతో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. లక్ష్మణ్ చాందా మండలం పీచర గ్రామానికి చెందిన సతీష్ ను ఇటీవలే చేపల వేట విషయంలో పోలీసులు అరెస్ట్ చేసి సబ్ జైలుకు తరలించారు. మృతుడు సతీష్ రెండు రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆయనను ఆసుపత్రి తరలించే లోగానే మరణించినట్లు సబ్ జైలు వర్గాలు చెబుతున్నాయి. మృతుడు సతీష్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సతీష్ రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. సీరియస్ అయ్యే వరకు ఎందుకు చూస్తూ ఉండిపోయారని నిలదీస్తున్నారు. తమ కొడుకుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.