బషీర్ బాగ్/గచ్చిబౌలి, వెలుగు: ‘ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్’ విధానం అమలు చేయాలని బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి సెక్రటేరియెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సెక్రటేరియెల్‌లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ భర్తలకు దూర ప్రాంతాల్లో డ్యూటీలు వేయడం, నెలల తరబడి ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కానిస్టేబుళ్ల భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలు తమ తండ్రులను గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి 3, 6 నెలలకోసారి వివిధ ప్రాంతాలకు పంపించడంతో పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ‘ఏక్ పోలీస్.. ఏక్ స్టేట్’విధానం అమలు చేస్తానని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. ప్రత్యేక బెటాలియన్ బలగాలకు కనీసం ఐదేండ్లు ఒకచోట పనిచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాగా, బెటాలియన్లలో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుళ్లకు సెలవులు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు మెయిన్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న వారిపై గచ్చిబౌలి పోలీసులు బెదిరింపులకు దిగారు. మీ పని తర్వాత చెబుతామంటూ వారి ఫొటోలు తీసుకున్నారు. కాగా, మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బెటాలియన్ కమాండెంట్ సన్నీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.