లింగంపేట, వెలుగు : అడవి పందులు వస్తున్నాయని, వాటిని చంపడానికి తన పొలానికి కరెంట్వైరు ఏర్పాటు చేశాడో ఎంపీటీసీ. అయితే అది గమనించని పక్క పొలం రైతు వైర్లకు తగిలి షాక్తో చనిపోయాడు. ఇది చూసిన సదరు ఎంపీటీసీ తనపైకి ఎక్కడ వస్తుందేమోనని భయపడి శవానికి బండ కట్టి పక్కనే ఉన్న నిజాంసాగర్ప్రాజెక్టు బ్యాక్వాటర్లో పడేశాడు. మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ధర్నా చేయడం, పోలీసులు జోక్యం చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్లో మంగళవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి నల్లపోశెట్టి(43) అనే రైతు సోమవారం తెల్లవారుజామున తన పొలానికి వెళ్తున్నాడు. దారిలో అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ, రైతు అయిన మోతె శ్రీనివాస్ తనపొలంలో అడవిపందుల రక్షణ కోసం కరెంట్వైరు ఏర్పాటు చేసి కనెక్షన్ఇచ్చాడు.
ఈ వైరును గమనించని పోశెట్టి దానికి తాకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో శ్రీనివాస్ మరికొందరి సాయంతో శవాన్ని పక్కనే ఉన్న నిజాంసాగర్ బ్యాక్వాటర్లో బండరాయి కట్టి పడేశాడు. సాయంత్రమైనా పోశెట్టి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా పక్కరైతు పొలం వద్ద మృతుడి చెప్పులు కనిపించాయి. అక్కడున్న కరెంట్ వైరు, మనిషి కిందపడిన ముద్రలు గుర్తించి ఏం జరిగిందో అర్థం చేసుకోగలిగారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం వరకు కూడా ఏదీ తేల్చకపోవడంతో పోశెట్టికి ఏమైందో ..ఎక్కడున్నాడో చెప్పాలని గ్రామస్తులతో కలిసి హైదరాబాద్–- బోధన్ రోడ్డుపై ఆత్మకూర్గేట్వద్ద రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డు పెట్టి రాస్తారోకో చేశారు.
ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, లింగంపేట ఎస్ఐ శంకర్వచ్చి నచ్చజెప్పినా వినలేదు. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా శవాన్ని బ్యాక్వాటర్లో పడేసినట్లు చెప్పడంతో బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన ఎంపీటీసీ శ్రీనివాస్ మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేశామని, మంగళవారం శవం దొరకడంతో మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్ఐ ఉమేశ్ తెలిపారు.
కరెంటు కంచెకు మరో ఇద్దరి బలి
నిర్మల్: పంట చేను రక్షణ కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం పొనకల్ గ్రామానికి చెందిన మద్దిపడగ మల్లయ్య(64) తన గొర్రెలను మేపేందుకు వెళ్తుండగా పంటల రక్షణ కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి షాక్ తో అక్కడికక్కడే చనిపోయాడు. పొనకల్ గ్రామానికే చెందిన డ్యాగల బొర్రన్న(50) అనే రైతు తన పంట చేనుకు వెళుతూ దారిలోని పంట చేనును దాటుతుండగా అక్కడ అమర్చిన కరెంటు తీగలు తగలి షాక్ కు గురై మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.