- పంట నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి
- తమతో మాట్లాడనప్పుడు ఎందుకొచ్చారంటూ నర్సంపేటలో నిలదీసిన రైతులు
- వరంగల్లో నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి పర్యటన
- ధైర్యం చెప్పడానికే వచ్చామన్న మినిస్టర్లు
- నష్ట పరిహారంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
వరంగల్ / నర్సంపేట / పరకాల, వెలుగు: పంట నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును రైతులు వేడుకున్నారు. మంత్రులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లాకు చేరుకున్న మంత్రులు.. మొదట పరకాల మండలం మల్లక్కపేట, నాగారం, నడికూడ మండలం నర్సక్కపల్లిలో పాడైపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరకాల మండలం నాగారానికి చెందిన మహిళా రైతులు.. నేలరాలిన మిర్చి పంటను దోసిళ్లలో తీసుకొచ్చి
మంత్రులకు చూపుతూ కాళ్లమీద పడ్డారు. ‘‘ఉన్నదంతా పంట పెట్టుబడికే పెట్టినం. మీ కాళ్లు మొక్కుతం.. మీరే ఆదుకోవాలి సారూ” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోకుంటే, తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఓదార్పుతో ఆగకుండా, పంట నష్ట పరిహారం ఇప్పించాలని చేతులెత్తి మొక్కారు. నడికూడ మండలంలో రైతులు అల్లె రాజయ్య, మాషబోయిన బాబు, వాళ్ల కుటుంబ సభ్యులు ఆదుకోవాలంటూ మంత్రుల కాళ్ల మీద పడ్డారు.
నష్ట పరిహారం అంటూ ఉండదు: నిరంజన్ రెడ్డి
‘‘వానలకు దెబ్బతిన్న పంటలను చూసిరమ్మని సీఎం కేసీఆర్ చెప్పారు. మీకు ధైర్యం చెప్పేందుకే మేమిక్కడికి వచ్చాం” అని రైతులతో నిరంజన్ రెడ్డి చెప్పారు. ‘‘కష్ట కాలంలో రైతులను ఆదుకునే మెకానిజం దేశంలో లేదు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు సహాయ పునరావాసం మాత్రమే ఉంటుంది. తక్షణ నష్ట పరిహారం ఉండదు. రాష్ట్రాల చేతిలో సర్వాధికారాలు లేవు” అని తెలిపారు. కలెక్టర్లు రైతుల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపితే, ఎలా ఆదుకోవాలనే దానిపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తారన్నారు. ‘‘తెలంగాణ రైతుల రాష్ట్రం. ఎవరు అధైర్య పడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది” అని భరోసా ఇచ్చారు. కాగా, నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. పంటలకు ఇన్సూరెన్స్ కల్పించేందుకు కొత్త పథకం తీసుకురావాలని సర్కార్ ఆలోచన చేస్తోందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు.
సీఎం రిపోర్టు తెమ్మన్నరు: ఎర్రబెల్లి
‘‘రైతుల బాధలు విని, వారికి ధైర్యం చెప్పాలని సీఎం కేసీఆర్ మమ్మల్ని పంపించారు. పంట నష్టంపై సర్వే చేసి, రిపోర్టు తెమ్మని చెప్పారు” అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 56 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. కేసీఆర్ మనుసున్నా మా రాజు అని, ఏదో ఒక విధంగా సాయం చేస్తారని భరోసా ఇచ్చారు. మంత్రుల వెంట ఎంపీలు పసునూరి దయాకర్, కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‍రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‍రెడ్డి, గండ్ర వెంటకరమణారెడ్డి, జడ్పీ చైర్‍పర్సన్ గండ్ర జ్యోతి ఉన్నారు.
మంత్రులపై రైతుల మండిపాటు..
నర్సంపేట నియోజకవర్గంలో మంత్రులకు నిరసన సెగ తగిలింది. మంత్రుల తీరు సరిగా లేదంటూ రైతులు మండిపడ్డారు. నర్సంపేటలో ఇప్పల్ తండా వద్ద హైవేకు దగ్గర్లో పెద్ద స్జేజీ ఏర్పాటు చేయగా, మంత్రుల కోసం రైతులందరూ అక్కడే వేచి చూశారు. కానీ, మంత్రులు మాత్రం అక్కడికి రాకుండా.. వేదికకు అరకిలోమీటర్ దూరంలోనే కాన్వాయ్ ని ఆపి, పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లారు. అక్కడున్న కొంతమంది రైతులతో మాట్లాడారు. స్టేజీ దగ్గర పెద్ద సంఖ్యలో ఉన్న రైతులు సీరియస్ అయ్యారు. ‘‘మంత్రులు వస్తున్నరంటే అన్నం తినకుండా ఎదురుచూసినం. మాతో మాట్లాడుతారంటే 10 గంటల నుంచి టెంట్ కింద కూర్చున్నం. కానీ మా దగ్గరికి రాలేదు. మాతో మాట్లాడనప్పుడు.. వాళ్లెందుకు వచ్చినట్టు. ఇదేం ఓదార్పు” అంటూ మండిపడ్డారు. పంట నష్టంపై క్లారిటీ ఇవ్వని మంత్రులు ఎందుకొచ్చారంటూ ఫైర్ అయ్యారు. ‘‘వీ వాంట్ జస్టిస్.. కేసీఆర్ డౌన్ డౌన్.. పెద్ది గో బ్యాక్” అంటూ మంత్రుల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆపారు.