జొన్న, మక్కల కొనుగోళ్లపై సర్కారు ఆంక్షలు

జొన్న, మక్కల కొనుగోళ్లపై సర్కారు ఆంక్షలు
జొన్న ఎకరానికి 5, మక్కజొన్న 26 క్వింటాళ్లే కొంటున్నరు
ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేసేలా సర్కారు తీరు
దిగుబడి ఎక్కువ ఉన్నా తక్కువ కొనుగోళ్లు 
సర్కారు పరిమితితో  రైతులకు తిప్పలు

ఆదిలాబాద్ / నిర్మల్, వెలుగు : సరైన ప్లానింగ్​ లేక వడ్ల కొనుగోళ్లను తీవ్ర ఆలస్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. మక్కలు, జొన్నల 
కొనుగోళ్లపైనా అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులను ఆగం చేస్తోంది. మక్కలు ఎకరాకు 40 క్వింటాళ్లు, జొన్నలు 20 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుండగా, మక్కలు 26.80 క్వింటాళ్లు,  జొన్నలు 5.16 క్వింటాళ్లు మాత్రమే సేకరించాలని మార్క్​ఫెడ్​ ఆఫీసర్లను ఆదేశించింది. దీంతో మిగిలిన పంటను ఏంచేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసర్లను రిక్వెస్ట్​ చేసినా లాభం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్​వ్యాపారులకు తక్కువరేటుకు అమ్ముకుంటున్నారు. 

ఆలస్యంగా రంగంలోకి.. ఆపై అరకొర కొనుగోళ్లు.. 

రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్ లో మక్క 6 లక్షల 48 వేల 446 ఎకరాల్లో, జొన్న 1,26,926 ఎకరాల్లో సాగైంది. మక్క సాగు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా జొన్నలు అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో 54,314 ఎకరాల్లో, ఉమ్మడి మెదక్​లో 35,709 ఎకరాల్లో పండింది. ఈసారి  మక్క ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు, జొన్న 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్​లో క్వింటాల్​మక్కలకు రూ.1962, జొన్నలకు రూ.2,970 మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రైవేట్​ వ్యాపారులు మక్కలకు రూ.1700, జొన్నలకు రూ. 2400 మించి పెట్టడం లేదు. దీంతో మద్దతు ధర దక్కేలా చూసేందుకు మార్కెట్​ ఇంటర్వెన్షన్ ​స్కీం కింద టీఎస్​ మార్క్​ఫెడ్​ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మక్క, జొన్న కొనుగోళ్లు చేపట్టింది.

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ​160 దాకా సెంటర్లలో మక్కలను, జొన్నలను మార్క్​ఫెడ్ ​కొంటున్నది. కానీ, మక్కలను ఎకరాకు 26.80 క్వింటాళ్ల చొప్పున, జొన్నలను 5.16 క్వింటాళ్ల చొప్పున మాత్రమే సేకరించాలని సర్కారు కండీషన్​ పెట్టడంతో ఆఫీసర్లు సగం సగమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్​వ్యాపారులకు తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ఈ రెండు పంటలు చేతికి వచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం ఆలస్యంగా మార్క్​ఫెడ్​ను రంగంలోకి దించడంతో ఈలోపే చాలా మంది రైతులు పంటను అగ్గువకు అమ్ముకొని నష్టపోయారని, తీరా ఇప్పుడు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడం అన్యాయమని రైతు సంఘాలు అంటున్నాయి. వెంటనే కొనుగోళ్లపై పరిమితి ఎత్తేసి, రైతులు తెచ్చిన పంటను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.  

ఆందోళనలు ఉధృతం చేస్తం..

అసలే ఆలస్యంగా కొనుగోళ్లు స్టార్ట్​ చేశారు. చాలా మంది ఇప్పటికే అమ్ముకొని నష్టపోయారు. తీరా ఇప్పుడు పరిమితుల పేరుతో రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా జొన్న పంట సాగైంది.   గతేడాది 10 క్వింటాళ్ల చొప్పున కొని ఈసారి 5 క్వింటాళ్లకు తగ్గించడం అన్యాయం. జొన్న, మక్కజొన్న పంటలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం.  

– సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు

పంట మొత్తం కొనాలి.. 

ఈ ఏడాది ఏడెకరాల్లో జొన్న పంట వేసిన. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. కానీ ఆఫీసర్లు ఎకరానికి 5 క్వింటాళ్లే కొంటమని చెప్తున్నరు. గతేడాది పది క్వింటాళ్లు కొనుగోలు చేసి, ఈసారి అందులో సగమే కొంటున్నరు. మిగిలిన పంటను ఎక్కడమ్మాలె. మార్క్​ఫెడ్​ల మద్దతు ధర ఇస్తున్నరు.  దళారులకు అమ్మితే నష్టపోతం. అందువల్ల పంట మొత్తం సర్కారే కొని ఆదుకోవాలె. 

–నవ్వ భోజన్న, కనుగుట్ట, బోథ్, 

ఆదిలాబాద్​ జిల్లా తక్కువ ధరకు అమ్ముకున్న

పది ఎకరాల్లో  మొక్కజొన్న పంట సాగుచేసిన.  230 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆశించిన దిగుబడి వచ్చినప్పటికీ అధిక వానల వల్ల కొంత నష్టం జరిగింది. ప్రభుత్వం మా మండల పరిధిలో ఎక్కడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రైవేటు వ్యక్తులకు  క్వింటాల్​కు రూ.1500 చొప్పున అమ్మాల్సి వచ్చింది. ప్రభుత్వం సకాలంలో సెంటర్​ ఏర్పాటుచేస్తే నష్టపోయేవాళ్లం కాదు.  

–ఠాకూర్ సందీప్ సింగ్, గిర్నూరు, బజార్​హత్నూర్​ మండలం