నిండా మునిగినం.. ఆదుకోండి... సీఎం కేసీఆర్​కు రైతులు మొర

ఖమ్మం, వెలుగు: ‘సారూ​.. అకాల వర్షంతో నిండా మునిగినం.. పరిహారం ఇచ్చి ఆదుకోండి..’ అని సీఎం కేసీఆర్​కు రైతులు మొరపెట్టుకున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు గురువారం ఖమ్మం జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్​కు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ ఆరుగాలం రెక్కల కష్టం నీళ్లపాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, వెంటనే క్రాఫ్​లోన్లను మాఫీ చేసి, పోడు పట్టాలివ్వాలని లెఫ్ట్​పార్టీల లీడర్లు సీఎంకు విన్నవించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు మక్కకు ఎకరానికి రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారాన్ని అందించాలన్నారు. కౌలు రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. వీఆర్ఏలతోపాటు రెండో ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించి వారిని రెగ్యులర్ చేయాలని కోరారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని, పేపర్ లీకేజీ నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎంను అడ్డుకుంటారనే అనుమానంతో జిల్లావ్యాప్తంగా ప్రతిపక్ష లీడర్లను అరెస్ట్​ చేసిన పోలీసులు పర్యటనకు  భారీ బందోబస్తు కల్పించారు.  సీఎం కేసీఆర్​హెలీక్యాప్టర్​లో గురువారం ఉదయం 11.43  గంటలకు ఖమ్మం జిల్లా బోనకల్ మండల రామాపురానికి చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే ద్వారా అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను  పరిశీలించారు. రావినూతలలో పంట నష్టం పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ ​పంట నష్టం వివరాలను సీఎంకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 31,038 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 19,552 మంది రైతులు ఒక్క మక్కలోనే 30,792 ఎకరాల్లో పంటను నష్టపోయారని వివరించారు. కాగా సీఎం పర్యటన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.పోలీసు, భద్రతాసిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీఎం వెంట జిల్లా బీఆర్​ఎస్​ నాయకులు, అధికారులు ఉన్నారు.