రైతు ఉద్యమం మలుపులు తిరుగుతోంది

రైతు ఉద్యమం మలుపులు తిరుగుతోంది

దాదాపు రెండు నెలలుపైగా ఢిల్లీ బార్డర్‌‌‌‌లో రైతులు ఉద్యమం చేస్తున్నారు. అగ్రి చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌‌తో వారంతా ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ అనేక మలుపులు తిరుగుతోంది. అప్పటివరకు శాంతియుతంగా జరిగిన ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. జనవరి 26న ఎర్రకోటను ముట్టడించిన రైతులు పోలీసులపై దాడికి దిగిన్రు. క్రమంగా రాజకీయరంగు పులుముకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు దీనిపై స్పందిస్తున్నారు. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఉద్యమం రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలతోనే, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం రావాలి.

పార్లమెంటు ఆమోదించిన రైతు చట్టాలను పూర్తిగా ఎత్తేయాలని ఢిల్లీ బార్డర్‌‌‌‌లో వేలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అనే విషయం అందరి దృష్టికి వచ్చింది.  ముఖ్యంగా జనవరి 26 న ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు దానిలో ఒక కీలక పరిణామం.  ఆందోళనలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు కొందరు ఈ సంఘటనపై విచారం కూడా వ్యక్తం చేశారు.

శాంతియుతంగా ‘‘చక్కా జామ్‌‌’’

ఈనెల 6న నిర్వహించిన‘‘చక్కా జామ్‌‌’’ పేరుతో రహదారి దిగ్బంధ కార్యక్రమం శాంతియుతంగానే ముగిసింది. ఈ సందర్భంగా కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయిత్​ మాట్లాడుతూ ‘‘ అక్టోబర్ 2లోగా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరించుకోకపోతే తదుపరి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం. ప్రభుత్వం మాపై ఒత్తిడి తీసుకొని వచ్చి మాతో  చర్చలు జరపలేదు’’ అని ప్రకటించారు. కాగా.. రైతుల సంక్షేమం కోసం అనేక రాయితీలను ఇప్పటికే ప్రకటించామని,  వ్యవసాయ రంగానికి కొత్త పెట్టుబడులను తీసుకొని రావటం తమ లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మన దేశంలోని 9.29 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది 15 శాతమని, గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించాయని కేంద్రం ఆరోపించింది. నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తాము ప్రయత్నం చేస్తున్నాము అని స్పష్టం చేస్తోంది.  అలాగే దేశ శ్రామికశక్తిలో సగం శక్తి వ్యవసాయ రంగానిదే  కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని  ప్రభుత్వం చెప్తోంది. కానీ, ప్రభుత్వంతో రైతులు ఏకీభవించడం లేదు. ఈ చట్టాల వల్ల కార్పొరేట్‌‌ సంస్థలకు ఎక్కువ లాభం చేకూరుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా క్రమంగా గోధుమలు, బియ్యం కొనుగోలు చేయడం ఆపేస్తుందని చెబుతున్నారు.

మోడీని బలహీనం చేయాలనా?

ఉద్యమంపై రాజకీయ ప్రాబల్యం కూడా క్రమంగా  పెరుగుతుందనిపిస్తోంది. ఎలాగైనా మోడీని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బలహీన పరచాలనే ఎజెండాతో ఉన్న ప్రతిపక్షాలకు రైతు ఉద్యమం కలిసొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఆందోళన ఇట్లాగే  కొనసాగించగలిగితే బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని కొనసాగించేందుకు దారులు వెతుకుతున్నారు.  అందుకే పార్టీల్లోని రెండో శ్రేణి, మూడో శ్రేణి నాయకులు ఉద్యమ నాయకులను కలుస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఆలోచింపజేస్తోంది

ఈ చట్టాల్లో ఏముందో తెలియకపోయినా, దాని వల్ల ఉన్న లాభనష్టాలు తెలియకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఆలోచనలో పడ్డారు. రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాళ్లు ఆలోచనలో పడుతున్నారు. ఇన్ని రోజులుగా ఉద్యమం జరుగుతుండటంతో ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకమనే తప్పుడు సంకేతాలు కూడా దేశంలో మిగతా రైతులకు వెళ్తున్నాయి.  ఫిబ్రవరి 5వ తేదీన శుక్రవారం రైతు ఉద్యమానికి మద్దతుగా ఉత్తరప్రదేశ్‌‌లో పది వేల మందికి పైగా రైతులు నిరసన ప్రదర్శన చేశారు.  భాగ్‌‌పాట్  జిల్లాకు చెందిన రైతు నేత రామ్ కుమార్ చౌదరి బైన్‌‌స్వాల్ రైతులతో మాట్లాడుతూ ”ఇప్పటి వరకూ గ్రామాల నుండి ఒక్క శాతం రైతులు కదిలారు, అదే 50 శాతం మంది  రైతులు కదిలితే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు అని అన్నారు.  రైతు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మేము కూడా ఢిల్లీ బయలు దేరవలసి వస్తుంది” అని మీడియాతో చెప్పాడు. ఉత్తర ప్రదేశ్ రైతుల కదలికలు పెరిగితే సమస్య ఇంకా జటిలం అవుతుంది. ఉత్తర ప్రదేశ్ జాతీయ రాజకీయాలకు యుద్ధభూమి.  ఆ రాష్ట్రంలోని చెరుకు రైతుల నిరసన అందరికి  ఆందోళన కలిగిస్తుంది. అంతే కాకుండా హింసపై నమ్మకం ఉన్నవారు, జాతి వ్యతిరేక శక్తుల ప్రాబల్యం క్రమంగా ఉద్యమంలో పెరుగుతుంది.  రైతు సంఘాల నాయకులకు దాన్ని అదుపులో ఉంచగలిగే శక్తి  ఉందా? అనేది ఒక పెద్ద ప్రశ్న.

ఐక్యరాజ్యసమితి ట్వీట్‌‌

మరోవైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో పాప్‌‌స్టార్ రిహానా, పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్​బర్గ్​ ఉన్నారు. ”ఆందోళనకు ఒక దగ్గరే చేరటం, శాంతియుత నిరసన తెలియ చేయటం రైతుల మానవ హక్కులు.. ఆ హక్కులకు ఆన్‌‌లైన్, ఆఫ్‌‌లైన్‌‌లో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, నిరసన కారులు కూడా సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి  మానవహక్కుల  హై కమిషనర్ కార్యాలయం ట్వీట్ చేసింది.  రైతులతో తిరిగి చర్చలు ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలని అమెరికా కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.  భారత ప్రభుత్వం కూడా ఒక్క అడుగు వెనక్కి వేసి చట్టాలు అమలు కొంతకాలం వాయిదా వేయడానికి,  చట్టాల్లో ఎలాంటి  సవరణలు అయినా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. చర్చలకు ఎప్పుడూ మేము సిద్ధం అని కూడా చెప్పింది.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు  ప్రధాని నరేంద్ర మోడీ రైతు ఉద్యమంపై స్పందించి మాట్లాడారు.

ఖలిస్తాన్‌‌ మద్దతు సంకేతాలతో ఆందోళన

అనేకమంది అనేక రకాలుగా రైతు ఉద్యమం గురించి వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు ఎన్ని కామెంట్స్‌‌ చేసినా ప్రభుత్వం ఎంతో  సంయమనంతో వ్యవహరించడం కూడా చూస్తున్నాం. వ్యాఖ్యానాలు చాలా దూరం వెళ్లాయి. రైతు ఉద్యమం ప్రభుత్వానికి, దేశానికి ఒక జాతీయ సమస్య అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతులు, రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్యమిస్తున్నారా? అనేది ఒక ప్రశ్న. ఈ ఉద్యమం వెనుక ఖలిస్తాన్ వేర్పాటు వాదుల పరోక్ష  మద్దతు ఉందని జనవరి 26న జరిగిన హింసాత్మక సంఘటనలతో అర్థమవుతోంది. రైతు నాయకుల పై రాజకీయ ఒత్తిడి కూడా ఎంతమేరకు ఉందనే విషయం ఆలోచించాలి.

ఆమోదయోగ్య పరిష్కారమే అంతిమ లక్ష్యం

అసలు భారతదేశం ఆత్మ ”గ్రామీణ భారతం”. ఈ విషయాన్ని దశాబ్దాలుగా పరిపాలించిన కాంగ్రెస్ విస్మరిస్తూ వచ్చింది. దాని ఫలితం దేశం మొత్తం అనుభవిస్తోంది.  దేశం ఆర్థికంగా శక్తివంతంగా ఉండాలి అనుకుంటే గ్రామీణ భారతాన్ని విస్మరించలేం. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ భారతం అభివృద్ధి గురించి ఇప్పుడున్న ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అలాంటి ప్రభుత్వం  రైతులకు నష్టం కలిగిస్తుందా?  అనే ప్రశ్నను  దేశంలో అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యమ నాయకులకు మధ్య ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చర్చలు జరగాల్సిన అవసరం ఉంది.   ఉద్యమ నాయకులు కూడా చట్టాల్లో సవరణలు చేసేందుకు సూచనలు ఇవ్వాలి. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి అనే వాదనను పరిశీలించుకోవాలి. అలాగే   ప్రభుత్వం కూడా రైతు చట్టాల సవరణలకు సంబంధించి రైతు నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని దేశమంతా కోరుకుంటోంది.

రాజకీయ ప్రయోజనాల కోసమే

దేశ రాజకీయ ముఖచిత్రం జాగ్రత్తగా గమనించినట్లయితే పార్లమెంట్‌‌లోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ఒక జాతీయ పార్టీగా వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా ఆ పార్టీ నడుస్తోందని అర్థం అవుతోంది.   కాంగ్రెస్ తీరు కారణంగా ఆ పార్టీకి లాభం చేకూరకపోగా, దాని ఫలితంగా సంకుచితంగా ఆలోచించే ప్రాంతీయ పార్టీలు లాభపడుతున్నాయా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే దేశంలోఎక్కువ సమస్యలు ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ చాలా దయనీయ పరిస్థితిలో ఉండటం వల్ల.. వివిధ రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అందిపుచ్చుకునేందుకు ఆ పార్టీ ఆమడ దూరంలో ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి అధికారపక్షంగా కొనసాగిన కాంగ్రెస్ ఇంతటి దయనీయంగా మారటం కూడా దేశానికి పెద్ద సమస్య. ప్రాంతీయ పార్టీలు తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రాంతీయతత్వాలు, భావోద్వేగాలను ఎలా రెచ్చగొడుతున్నాయో దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి పరిస్థితుల్లో  ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ఉద్యమాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తున్నాయా? అనే ప్రశ్న ముందుకొస్తోంది.  – ఆర్.మల్లిఖార్జునరావు పొలిటికల్​ ఎనలిస్ట్​