సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకం.. ధర తగ్గిస్తేనే బొగ్గు కొంటం అంటున్న పరిశ్రమలు.. లేకుంటే ఇతర సంస్థల నుంచి దిగుమతి

సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకం.. ధర తగ్గిస్తేనే  బొగ్గు కొంటం అంటున్న పరిశ్రమలు.. లేకుంటే ఇతర సంస్థల నుంచి  దిగుమతి
  • సింగరేణికి సూచించిన స్మాల్​ఇండస్ట్రీస్​ కంపెనీలు
  • లేకుంటే ఇతర సంస్థల నుంచి బొగ్గు దిగుమతికి ఇంట్రెస్ట్  
  • పరిశ్రమలు దూరమైతే సింగరేణికి భవిష్యత్ లో నష్టమే
  • ఆ కంపెనీలకు ​-ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు సప్లై 

కోల్​బెల్ట్, వెలుగు :  బొగ్గు మార్కెట్​లో  సింగరేణి ధరల్లో పోటీ ఎదుర్కొంటుంది. మెజార్టీ కొనుగోలు దారులు దూరమవకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నా తాజాగా స్మాల్​ఇండస్ర్టీస్ మరోసారి షాక్​ ఇచ్చాయి. పెరిగిన ఖర్చుల దృష్ట్యా తక్కువ ధరకు అమ్మితేనే బొగ్గును కొంటామని తేల్చిచెప్పాయి.  లేదంటే తక్కువ ధరకు అమ్మే సంస్థల నుంచి తెచ్చుకుంటామని స్పష్టంచేశాయి. 

దీంతో చిన్న పరిశ్రమలు దూరమైతే  ఏటా 5 మిలియన్​టన్నుల బొగ్గు అమ్మకాలు సింగరేణికి తగ్గిపోతాయి. దేశంలోని ఇతర కంపెనీలతో పోల్చితే సంస్థ బొగ్గు ధర అధికంగా ఉండగా కొనుగోలు ఆర్థిక భారంగా మారిందని ఇప్పటికే  దక్షిణాది రాష్ట్రాల విద్యుత్​సంస్థలు పేర్కొన్నాయి. సింగరేణి తవ్వే బొగ్గులో 80శాతం విద్యుత్ కేంద్రాలకే సప్లై చేస్తోంది. 

సింగరేణి బొగ్గుకే అధిక ధర 

సింగరేణి బొగ్గు జీ-5 గ్రేడ్ టన్ను ధర రూ.5,685 ఉంది.  అదే కోలిండియా సంస్థలైన ఒడిశాలోని మహానది కోల్​ఫీల్డ్స్, మహారాష్ట్రలోని వెస్ర్టన్​కోల్​ఫీల్డ్స్​బొగ్గు టన్ను రూ.2,970 ఉంది. జీ-16 గ్రేడ్​టన్నుకు సింగరేణి బొగ్గు రూ.1,620, మహానది రూ.514, వెస్ర్టన్​ రూ.614  చొప్పున ఉన్నాయి.  ప్రధానంగా సింగరేణి జీ9, జీ10, జీ11,జీ12 గ్రేడ్ రకాల బొగ్గు సప్లై చేస్తోంది. కోలిండియా సంస్థలు తక్కువ ధరకు అమ్ముతుండగా  మెజార్టీ విద్యుత్ సంస్థలు అటువైపే ఇంట్రెస్ట్ చూపాయి. 

కేంద్రం ప్రైవేటు సంస్థకు బొగ్గు బ్లాక్​లను కేటాయిస్తుం డగా త్వరలోనే సింగరేణి కంటే తక్కువ ధరకే అమ్మే చాన్స్ ఉంది. దీంతో కూడా గిరాకీ తగ్గే ప్రమాదం కూడా ఉంది.  ప్రస్తుతానికి సింగరేణికి సొంత విద్యుత్  కేంద్రాలు రక్షణగా నిలిచాయి. సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తం గా డిమాండ్​ఉన్నా..మార్కెట్ లో ధరల పోటీ కారణంగా బొగ్గును లాభానికి అమ్ముకునేందుకు పలు చర్యలు తీసుకుంటుంది.

పరిశ్రమల మనుగడ కోసమైనా తగ్గించాలె

ఇటీవల సింగరేణి మేనేజ్ మెంట్ నిర్వహించిన మీటింగ్ లో క్లిష్టమైన మార్కెట్ పరిస్థితుల్లో మనుగడ సాగించాలంటే బొగ్గు ధర తగ్గించాల్సి ఉందని నవ భారత్, ఐటీసీ, ఓరియంట్ సిమెంట్, అల్ట్రా టెక్ సిమెంట్, దివీస్ ల్యాబరేటరీస్, హెటిరో ఫార్మా, సిర్పూర్ పేపర్ మిల్స్ తదితర సుమారు 60 విద్యుతేతర కంపెనీలు సింగరేణి సంస్థ దృష్టికి తీసుకొచ్చాయి.  

పరిశ్రమల మనుగడ, తమపై ఆధారపడిన వేల మంది చిరు ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా తక్కువ ధరకు బొగ్గును కోలిండియా, విదేశాల నుంచి  దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొ న్నాయి. సింగరేణితో దశాబ్దాల అనుబంధం కారణంగా రవాణా సమస్యలు లేకుండానే  బొగ్గు తీసుకునే చాన్స్ కూడా ఉందని స్పష్టం చేశాయి.  ఇప్పటికే పోటీ మార్కెట్​లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నా మని, తక్కువ ధరకు బొగ్గు  అమ్మే సంస్థలపై  చూడాల్సి వస్తుందని పేర్కొన్నాయి. సింగరేణి బొగ్గు ధరను తగ్గిస్తే తీసుకునేందుకు సిద్ధమేనని తేల్చిచెప్పాయి. 

వేల పరిశ్రమలకు బొగ్గు సప్లై

సింగరేణి సంస్థ ఏటా సుమారు 70 మిలియన్​టన్నులకు పైగా బొగ్గును 16 రాష్ట్రాల్లోని విద్యుత్​సంస్థలకు  80 శాతం అమ్ముతుంది. మిగిలిన 20శాతం బొగ్గును సుమారు 2వేల చిన్న తరహా పరిశ్రమలకు సప్లై చేస్తోంది. ఇందులో బొగ్గు ఆధారిత సిమెంటు, స్పాంజ్, ఐరన్, సిరామిక్స్, ఫార్మా, ఎరువులు వంటి వందలాది పరిశ్రమలు ఉన్నాయి. ఆయా సంస్థలు ప్రస్తుతం 5 మిలియన్ టన్నుల వరకు బొగ్గును కొంటున్నాయి.  మరోవైపు స్మాల్​ ఇండస్ర్టీస్​ కంపెనీలు  బొగ్గు ధరలు తగ్గించాలనే డిమాండ్​ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి. 

దీంతో స్మాల్​ఇండస్ర్టీస్​మార్కెట్​ను రక్షించుకునే అంశాలపై సింగరేణి దృష్టి సారించింది. ఇటీవల జీఎంలు, ఆఫీసర్లతో సింగరేణి సీఎండీ బలరాం రివ్యూ నిర్వహించారు. బొగ్గు నాణ్యతపై రాజీలేకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. స్మాల్​ఇండస్ర్టీస్​ కంపెనీలతో కూడా ఆయన చర్చలు జరిపారు. నాణ్యతపై ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.  త్వరలో మరో మీటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎండీ భరోసా ఇచ్చారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మిగిలిన రోజుల్లో సింగరేణి నుంచి బొగ్గును తీసుకోవాలని కోరారు.