కొడుకులు మాట వినట్లేదని తండ్రి ఆత్మహత్య

కొడుకులు మాట వినట్లేదని తండ్రి ఆత్మహత్య

ఆత్మకూరు, వెలుగు: ఆస్తి పంపకాల విషయంలో కొడుకులు తన మాట వినలేదని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తనుగుల పైడి( 60)కి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెండ్లిళ్లు చేశాడు. అయితే ఇంటి స్థలం పంపకం విషయంలో ఇద్దరు కొడుకులు గొడవపడ్డారు. బయట నుంచి పెద్ద మనుషులను తెచ్చుకొని పంచాయితీ చేసుకుంటామని తండ్రి పైడికి చెప్పారు. అందుకు ఆయన నిరాకరించాడు.

‘నేనే పెద్ద మనిషిగా బయటవారి పంచాయితీ తీరుస్తుంటాను. ఇప్పుడు నా ఇంటి పంచాయితీకి బయటవారిని పెద్దమనుషులుగా తీసుకురావద్దు’ అని పైడి కొడుకులతో చెప్పాడు. ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య మనస్పర్థలు పెరగడంతో బుధవారం రాత్రి పైడి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో వరంగల్​ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. మృతుడి భార్య గోపమ్మ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు ఫైల్​చేశారు.