అవిశ్వాసానికి సై..నకిరేకల్ మున్సిపాలిటీలో ఒకట్రెండు రోజుల్లో నోటీసు!

అవిశ్వాసానికి సై..నకిరేకల్ మున్సిపాలిటీలో ఒకట్రెండు రోజుల్లో నోటీసు!
  •     కాంగ్రెస్​కు మద్దుతుగా 12 మంది కౌన్సిలర్లు
  •     మరో ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపే
  •     కొత్త చైర్మన్ గా చెవుగోని శ్రీనివాస్​ ?

నకిరేకల్​మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకట్రెండు రోజుల్లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు ఎమ్మెల్యే వీరేశం వర్గం వేగంగా పావులు కదుపుతోంది. నకిరేకల్​మున్సిపల్  ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో మిగిలిన మున్సిపాలిటీలతో కలిపి అవిశ్వాసం పెట్టడం ఇక్కడ ఇన్నిరోజులు సాధ్యం కాలేదు. 

నల్గొండ, వెలుగు : నకిరేకల్​మున్సిపాలిటీకి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మూడేళ్లు దాటితేనే అవిశ్వాసం పెట్టడానికి వీలవుతుంది. మొత్తం కౌన్సిలర్లలో 2/3 వంతు మంది ఇందుకు మద్దతు తెలపాలి. ఈ లెక్కన మొత్తం 20 కౌన్సిలర్లలో పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్​ ఒకరు, ఫార్వర్డ్​ బ్లాక్ ​ఆరుగురు, బీఆర్ఎస్  నుంచి11 మంది గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇండిపెండెంట్​ఒకరు, ఫార్వర్డ్​ బ్లాక్​కు చెందిన ఆరుగురిలో ఇద్దరు కౌన్సిలర్లు గులాబీ పార్టీలో చేరారు. 

ఇప్పుడు కాంగ్రెస్​ గూటికి..

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి ఈ మార్చి నాటికి మూడేళ్లు పూర్తి కావడంతో ఎమ్మెల్యే వీరేశం వర్గం చకాచకా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. గతంలో ముగ్గురు చేరగా, సోమవారం వైస్​ చైర్మ న్​ మొరిశెట్టి ఉమారాణితో సహా ముగ్గురు చేరారు. ఫార్వర్డ్​బ్లాక్​కు చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్​కు సపోర్ట్​చేస్తున్నారు.

దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్​ బలం 12కు చేరింది. అయితే, అవిశ్వాసం నెగ్గాలంటే 14 మంది కౌన్సిలర్లు అవసరం కావడంతో.. బీఆర్ఎస్​లో చేరిన మిగిలిన ఇద్దరు ఫార్వర్డ్​ బ్లాక్​ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేశారు. వీరితో పాటు బీఆర్ఎస్​లో పలువురు కౌన్సిలర్లను కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో చేరికలు పూర్తికాగానే, అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

కొత్త చైర్మన్​ గా చెవుగోని శ్రీనివాస్​?

ప్రస్తుత చైర్మన్​ రాచకొండ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రధాన అనుచరుడు. శ్రీనివాస్​ను గద్దె దించితే కొత్త చైర్మన్​గా ఎమ్మె ల్యే వీరేశం ప్రధాన అనుచరుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన చెవుగోని శ్రీనివాస్​ను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న శ్రీనివాస్​ రెండు సార్లు కౌన్సిలర్​గా గెలిచారు. వైస్​ చైర్మన్​ గా ఇప్పుడున్న ఉమారాణినే కొనసాగించే అవకాశం ఉంది. వైశ్య వర్గానికి ప్రాధాన్యం కల్పించాల్సి ఉన్నందున ఆమె మార్పు ఉండదని తెలిసింది. 

చిరుమర్తి లింగయ్య సైలెంట్

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అవిశ్వాసంపై మౌనంగానే వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్​11 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన​రాలేదని తెలుస్తోంది. గత పాలకవర్గంలో నకిరేకల్​ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల టైంలో హడావుడిగా రోడ్ల వెడల్పు పనులు సగమే పూర్తిచేశారు. పోలీస్​స్టేషన్ వద్ద పెద్ద జంక్షన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టగా, ట్రాఫిక్​ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే వీరేశం కూల్చేయించారు.

ఇక వీరేశం ఎమ్మెల్యేగా గెలిచాక మున్సిపల్​రికార్డులను పరిశీలిస్తే అన్ని అప్పులు, అవకతవకలు, అడ్డగోలు ఖర్చులే ఉన్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు శంకుస్థాపనలు చేసి వదిలేశారని చెబుతున్నారు. కాబట్టి ఈ రెండేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిశ్చయంతో ఎమ్మెల్యే వీరేశం ఉన్నారు.