చి'వరి' రైతుల అరిగోస

చి'వరి' రైతుల అరిగోస
ఎండుతున్న పంట పొలాలు 
ఆలస్యంగా నాట్లు వేసిన రైతుల్లో ఆందోళన 
పొట్ట దశలోనే పంట ఆగమయ్యే పరిస్థితి 

కరీంనగర్, వెలుగు : ఎస్సారెస్పీ కాలువ మీద ఆధారపడి నాట్లు వేసిన రైతుల పొలాలకు చివరి తడికి నీరందే పరిస్థితి కనిపించడం లేదు. మొన్నటివరకు నిండుగా పారిన సబ్ కెనాల్స్.. ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఆలస్యంగా వరి నాట్లు వేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మరో 10 రోజులు నీళ్లు వదిలితే ఇబ్బంది ఉండదని, అదును మీద నీళ్లు నిలిపివేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ కెనాల్స్ మూసివేయడంతో చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూర్, హుజూరాబాద్.. తదితర మండలాల్లో ఆలస్యంగా నాట్లు వేసిన పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్లతో వరి కొంత దెబ్బతిన్నదని, ఇప్పుడు నీళ్లందకపోతే దిగుబడి మరింత పడిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తెగుళ్ల భయంతో ఆలస్యంగా నాట్లు..  

వానాకాలం పంట చేతికందిన వెంటనే నారుపోస్తే తెగుళ్ల బారిన పడే అవకాశముందనే ఉద్దేశంతో చాలా మంది రైతులు 20 రోజులు ఆలస్యంగా నారు పోశారు. దీంతో నాట్లు వేయడం కూడా ఆలస్యమైంది. కొందరు జనవరి చివరి వారంలో, మరికొందరు ఫిబ్రవరి మొదటి వారంలో నాట్లేశారు. ఇప్పుడు ఈ పొలాలన్నీ పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఆయకట్టుకు ఈ నెల 8 వరకు వారాబందీ పద్ధతిలో సాగునీరు అందించారు. మరో ఒకటి, రెండు తడులు పెట్టి ఆపేద్దామనుకునే టైంలోనే నీటి సప్లై నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 10 రోజులపాటు సాగునీరు వదిలాలని అప్పుడే తమ పంటలు చేతికొస్తాయని రైతులు వేడుకుంటున్నారు.

మరో 15 రోజులు నీళ్లిచ్చి ఆదుకోవాలి

నేను 14 ఎకరాల్లో వరి సాగు చేసిన.. మొదట్లో పోసిన నారు పాడైంది.. మళ్లీ నారు పోసి నాటేయడంతో 20 రోజులు ఆలస్యమైంది. పంటకు నీళ్ల తడి మాన్పడానికి మరో 15 రోజులు పట్టేలా ఉంది. ఐదు రోజుల క్రితమే ఎస్సారెస్పీ కాల్వ నీళ్లు నిలిపివేశారు. పొట్ట దశలో నీళ్లు ఆపేయడం వల్ల పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మరో 10 రోజులు నీళ్లు ఇస్తే పంట చేతికొస్తుంది. - శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి

ప్రభుత్వ ఆదేశాలతోనే నీటిని బంద్ చేస్తున్నాం

ఈ నెల మొదటి వారంలోనే నీటిని నిలిపివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతోనే నీటిని నిలిపి వేశాం. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరు ఉండడం వల్ల తాము కోతలు కోసుకోలేకపోతున్నామని రైతుల నుంచి మాపై ఒత్తిళ్లు ఉన్నాయి. ఎప్పుడు నీటిని నిలిపివేస్తారని రైతులు తమకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మళ్లీ ప్రభుత్వ ఆదేశానుసారం ఎప్పుడు నీటిని విడుదల చేస్తామనేది ప్రకటిస్తాం.

- శివ శంకర్, ఎస్ఈ, ఎస్సారెస్పీ