- హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్
- తుల్జా భవానీ రెడ్డికి కోర్టు నోటీసులు
- ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు
జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య పోరు రగులుతూనే ఉంది. కూతురు తీరు పై ఇప్పటికే హై కోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేసిన ముత్తిరెడ్డి ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీంతో తుల్జా భవానీ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తుల్జా భవానీ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగిస్తోందని, తీవ్ర ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తోందని ముత్తిరెడ్డి గత జూన్27న హైకోర్టులో రిట్పిటిషన్ వేశారు. దీంతో అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు తుల్జా భవానీ రెడ్డితో పాటు, ఆమె భర్త రాహుల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గత నెల 19న తుల్జా భవానీ దంపతులు జనగామ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అదే రోజు మరో మారు తండ్రి ప్రవర్తనపై మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. ఆ తర్వాత కూడా హైదరాబాద్లోని పలు టీవీ ఛానళ్లతో పాటు, యూట్యూబ్ఇంటర్వ్యూల్లో తండ్రి ముత్తిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సిటీ సివిల్కోర్టును ఆశ్రయించారు.
శాసనసభ్యుడిగా ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా తుల్జా భవానీ రెడ్డి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతోందని అందులో పేర్కొన్నారు. సాక్ష్యాలుగా పలు ఛానళ్లు, యూట్యూబ్ వీడియోలను జత చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రింట్, ఎలక్ర్టానిక్తో పాటు, సోషల్మీడియాలో, మరే ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన సిటీ సివిల్ కోర్టు ఈనెల 9న తుల్జా భవానీ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా ఎటువంటి కామెంట్స్ చేయరాదని పేర్కొంది. ఈ ఆదేశాలు ఈనెల 30 వరకు అమలులో ఉంటాయని చెప్పింది. ఈ నోటీసులు తుల్జా భవానీ రెడ్డికి ఈనెల 10న అందినట్లు ఆమె అనుచరుడు శివరామకృష్ణ ‘వెలుగు’కు తెలిపారు.