గేమింగ్ కింగ్ నజారా ఐపీఓ
వెబ్, మొబైల్, ఈస్పోర్స్ట్ వరకు అన్ని గేమ్స్ ఆఫర్
ప్రతి సబ్‌సెగ్మెంట్‌లోనూ ఎంటరైంది
బిజినెస్ డెస్క్, వెలుగు: నజారా టెక్నాలజీస్… ఇంటర్నెట్ గేమింగ్ వచ్చిన తొలి నాళ్లలో ఇండస్ట్రీలోకి వచ్చి ఓ వెలుగు వెలిగిన కంపెనీ. అప్పట్లో ప్రత్యేకంగా వెబ్ కోసమే గేమ్స్‌ను రూపొందించి మస్తు ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఈ గేమింగ్ కంపెనీ పలు సబ్‌సెగ్మెంట్లలోకి అడుగుపెడుతూ… ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ గ్రోత్‌కు ఒక ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. ఫాంటసీ స్పోర్ట్స్ నుంచి ఇన్ఫోటైన్‌మెంట్ వరకు అన్ని గేమింగ్ సెగ్మెంట్లలో ఇది ఉంది. ఇప్పుడిది మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టబోతోంది. రెండేళ్ల క్రితమే నజారా టెక్నాలజీస్ ఐపీఓ కోసం అప్లికేషన్ దాఖలు చేసినప్పటికీ మార్కెట్‌లోకి వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడిది ఎప్పుడెప్పుడు మార్కెట్‌లో అడుగుపెట్టాలా అని చూస్తోంది.. ఈ సందర్భంగా నజారా టెక్నాలజీస్ జర్నీ.. గేమింగ్ ఇండస్ట్రీలో ఈ సంస్థ సక్సెస్ గురించి కాస్త తెలుసుకుందాం…
నజారా టెక్నాలజీస్ ఏర్పాటులో నటుడు షమ్మి కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ కంపెనీ ఫౌండర్ నితీష్ మిట్టెర్సేన్‌కు షమ్మి కపూర్ మెంటర్. షమ్మి కపూర్ కోరిక మేరకు నితీష్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. 2000 సంవత్సరంలో నజారా టెక్నాలజీస్ వెబ్ కోసం ఫ్లాష్ గేమ్స్‌ను రూపొందించింది. ఆ సమయంలో మొబైల్ ఫోన్స్ చాలా కొత్త. గేమింగ్ కేవలం డెస్క్‌టాప్‌లకే పరిమితమైంది. వెబ్ గేమింగ్‌లో ఎలాంటి రెవెన్యూలు రాకపోతుండటంతో ఇన్వెస్టర్లు కూడా అంత పెద్దగా ఈ సెగ్మెంట్‌పై ఆసక్తి చూపించేవారు కాదు. యూజర్ల కోసం ఎవరూ ఫండింగ్ పెట్టేవారు కాదు. ఈ సమయంలో తమ గేమింగ్‌ను మరింత విస్తరించాలని నితీష్ నిర్ణయించారు. దీంతో మొబైల్ ఫోన్స్‌లోకి మార్కెట్‌ను విస్తరించామని కంపెనీ సీఈవో మనీష్ అగర్వాల్ చెప్పారు. టెల్కోల నుంచి గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యూజర్లు ఆడేవారు. క్వాలిటీ కంటెంట్ కోసం యూజర్లు మనీ కూడా చెల్లించేవారు. అలా మొబైల్ గేమింగ్‌లోకి తొలిసారి నజారా టెక్నాలజీస్ అడుగుపెట్టింది. ఈ కంపెనీ గ్రోత్‌కు టెలికాం ఆపరేటర్స్ కీలకమైన వారుగా ఉన్నారు. 2017–18లో వాల్యు యాడెడ్ సర్వీసుల బిజినెస్‌లు బాగా పడిపోయాయి. రెవెన్యూ స్ట్రీమ్‌లు దెబ్బతిన్నాయి. దీంతో అప్పుడు ఐపీఓను కంపెనీ ఉపసంహరించుకుంది. కానీ మళ్లీ ఇప్పుడు ఐపీఓకి కంపెనీ వెళ్లాలని చూస్తోంది. ఈ ప్రపోజల్‌ను నజారా టెక్నాలజీస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కూడా ఓకే చేశారు. ఇష్యూ ధర ఇంకా నిర్ణయించనప్పటికీ.. సుమారు రూ.950 కి అటూ, ఇటూగా ఇది ఉంటుందని తెలుస్తోంది. అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రూ.750–800 మధ్యలో ట్రేడవుతున్నాయి. ఈ ధర ఏప్రిల్‌లో రూ.400గా ఉండేది. ఐపీఓ వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటి నుంచి ధరలు అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో పైకి పెరుగుతున్నాయి.
మన టెన్సెంట్ ఇది..
గేమింగ్‌లో ప్రతి సబ్‌కేటగిరీలో ఉన్న ఒకే ఒక్క ఇండియన్ కంపెనీ నజారా. వెబ్ నుంచి మొబైల్‌లోకి వెళ్లిన తర్వాత ఈ కంపెనీకి బాగా పాపులారిటీ పెరిగిపోయింది. నజారా ఫ్యామిలీని మరింత విస్తరించేందుకు ప్లేయర్లను కూడా ఐడెంటిఫై చేయడం కంపెనీ 2017 నుంచి ప్రారంభించింది. రెండేళ్లలోనే పలు కంపెనీలను కొనుగోలు చేసింది. 2017 నుంచి పదికి పైగా కంపెనీల్లో ఇది ఇన్వెస్ట్ చేసింది. ఎర్లీ స్టేజ్ కంపెనీలను గుర్తించి, వాటిల్లో చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. పెద్ద కంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. కానీ విజన్ మాత్రం ఒక్కటే. గ్లోబల్‌గా మన గేమింగ్ బ్రాండ్స్‌ను సక్సెస్ చేయడమేనని కంపెనీ సీఈవో అగర్వాల్ అన్నారు. నజారా రెవెన్యూ స్ట్రీమ్స్ కోసం సబ్‌స్క్రిప్షన్, ప్రీమియం, ఈ–స్పోర్ట్స్ వంటి వాటిపై ఆధారపడుతోంది. ఈ–స్పోర్ట్స్, ప్రీమియం నుంచి కంపెనీకి మంచి రెవెన్యూలు వస్తున్నాయి. ఇండియాలో రియల్ మనీ గేమింగ్(ఆర్‌ఎంజీ) సెగ్మెంట్ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షిస్తోంది. కానీ ఈ ఇండస్ట్రీలో రిస్క్‌లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జీరో రెగ్యులేటరీ రిస్క్‌తో ఈ సెగ్మెంట్లలోకి వెళ్లాలనుకుంటున్నామని అగర్వాల్ అన్నారు. ఏటా ఆర్‌ఎంజీ 30 శాతం నుంచి 40 శాతం గ్రోత్ సాధిస్తోందని కానీ రెగ్యులేటరీ రిస్క్ కూడా ఉంటుందన్నారు.
యునిక్ బిజినెస్ మోడలే దీని సక్సెస్…
మార్కెట్‌లో లిస్ట్ కావాలనుకుంటోన్న తొలి దేశీయ గేమింగ్ కంపెనీ ఇదేనని అభిషేక్ సెక్యూరిటీస్ సందీప్ గినోడియా అన్నారు. స్ట్రాంగ్ ప్రమోటర్లు, యునిక్ బిజినెస్ మోడలే దీనికి ముఖ్య కారణంగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. కంపెనీ ఫ్లాగ్‌షిప్ మొబైల్ గేమ్స్‌లో ‘వరల్డ్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ 2’, ‘ఛోటా భీమ్ రేస్’, ‘మోటు పట్లు గేమ్’ ఉన్నాయి. 2019 ఫైనాన్షియల్ ఇయర్‌లో కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.183 కోట్లకు పెరిగింది. 2018లో ఈ రెవెన్యూ రూ.180 కోట్లుగానే ఉంది. నజారా టెక్నాలజీస్‌లో రాజేష్ జున్‌జున్‌వాలా, వెస్ట్‌బ్రిడ్జ్ వెంచర్స్, టర్టుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఐఎఫ్‌ఎల్ స్పెషల్ ఆపర్చునిటీ ఫండ్, ఎమర్జింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కీలక షేర్‌హోల్డర్స్‌గా ఉన్నారు. ఈ కంపెనీ తన గేమింగ్ ఆపరేషన్స్‌ను ఇండియాతో పాటు వెస్ట్ ఆసియా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికాల్లో కూడా విస్తరించింది.