- చెన్నై సమీపంలో ‘స్పేస్ జోన్ ఇండియా’ ప్రయోగం
- సబ్ ఆర్బిటల్ ప్రాంతంలోకి 3 క్యూబ్, 50 పికో శాటిలైట్లు.
- గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్‌పై పరిశోధనకు ఉపయోగం
చెన్నై: దేశంలో తొలిసారిగా రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. శనివారం ఉదయం 7.24 గంటలకు చెన్నై మెరీనా బీచ్‌కు సమీపంలోని తిరువేదాంతై తీర ప్రాంతం నుంచి ‘రూమీ–1 2024’ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు తమిళనాడుకు చెందిన ‘స్పేస్ జోన్ ఇండియా’ స్టార్టప్ ప్రకటించింది. దీనిని మొబైల్ వెహికల్ లాంచర్ మీద నుంచి ప్రయోగించామని, ఇలా రీయూజబుల్ రాకెట్ ను మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ప్రపంచంలోనే తొలిసారి అని ఆ సంస్థ వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ సమస్యలపై పరిశోధన కోసం తాము ఈ రాకెట్ ప్రయోగం చేపట్టామని తెలిపింది.
రూమీ–1లో 3 క్యూబ్ శాట్లు (2 కిలోలలోపు బరువు ఉండేవి), 50 పికో శాట్లు (కిలో లోపు బరువు ఉండేవి) అమర్చి పంపామని, వాటిని రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తులోని సబ్ ఆర్బిటల్ రీజియన్ లోకి విజయవంతంగా చేర్చిందని పేర్కొంది. క్యూబ్, పికో శాట్ల నుంచి అందే డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణంలోని కీలక అంశాలపై సమాచారం తెలుస్తుందని వివరించింది.
రూమీ–2 ప్రాజెక్టుపనులు షురూ..
రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్‌కు తన కొడుకు రూమిత్రన్ పేరిట ‘రూమీ’ అని నామకరణం చేసినట్టు స్పేస్ జోన్ ఇండియా సీఈవో ఆనంద్ మేఘలింగం వెల్లడించారు. మార్టిన్ గ్రూప్‌తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టామని, ఇందులో 1500 మంది స్కూల్ స్టూడెంట్లు కూడా భాగస్వాము లై శాటిలైట్ల తయారీ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. ‘‘స్టూడెంట్లు క్యూబ్, పికో శాటిలైట్ల తయారీలో పాలుపంచుకున్నారు. ఈ మిషన్ లో రాకెట్, శాటిలైట్లు అనుకున్నట్టుగా అన్ని రకాలుగా సత్తా చాటాయి. వివిధ ఎత్తుల్లో పేలోడ్ డేటాను సేకరించాం” అని ఆయన వెల్లడించారు.
తదుపరి దశలో 250 కిలోల పేలోడ్‌తో 250 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లగలిగే రూమీ–2 మిషన్ చేపడతామని, దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యా యన్నారు. పేలోడ్ బరువు పెరగను న్నందున ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో త్వరలో ప్రారంభించనున్న కులశేఖరపట్నం స్పేస్ పోర్టు నుంచి ప్రయోగించనున్న ట్టు తెలిపారు. రూమీ–2 ప్రాజెక్టులోనూ వందలాది మంది స్టూడెంట్లు పాల్గొంటారని పేర్కొన్నారు.