- నాలుగేండ్ల కింద జరిగిన ప్రమాదంలో దెబ్బతిన్న రెండు పంపులు
- రిపేర్లను పట్టించుకోని బీఆర్‌ఎస్ సర్కార్
- అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు
- ఎస్టిమేట్లు తయారు చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
నాగర్ కర్నూల్, వెలుగు : నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు, మూడు వేల గ్రామాలకు తాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఫస్ట్ లిఫ్ట్ ఎల్లూరు పంపుల రిపేర్లకు కసరత్తు ప్రారంభమైంది. నాలుగేండ్ల కింద జరిగిన ప్రమాదంలో ఈ లిఫ్ట్‌లోని రెండు పంపులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తర్వాత వాటికి రిపేర్లు చేయించేందుకు అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మూడు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పంపుల పునరుద్ధరణ, కాల్వలకు రిపేర్లు చేసి కృష్ణా వరద నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది.
1600 క్యూసెక్కులకే పరిమితం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్లూరులో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే కెపాసిటీ గల ఐదు పంపులు, మోటార్లను ఏర్పాటు చేశారు. 2020లో జరిగిన ప్రమాదంలో మూడవ పంప్ పూర్తిగా దెబ్బతినగా, ఐదో పంపు వినియోగానికి అవకాశం లేకుండా పోయింది. వీటి రిపేర్ బాధ్యతలను బీఆర్‌ఎస్ సర్కార్ పలు కంపెనీలకు అప్పగించినా చెల్లింపులు చేయకపోవడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో రెండు పంపులు నాలుగేండ్లుగా మూలకుపడ్డాయి.
ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మిగిలిన మూడు పంపుల్లో ఒకదాన్ని స్టాండ్‌బైగా ఉంచి కేవలం రెండు పంపులతోనే కథ నడిపించారు. కృష్ణానదికి వరద వచ్చిన టైంలో 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నాలుగు రిజర్వాయర్ల ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు, మూడు వేల గ్రామాలు, 19 మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీటిని అందించే ఎల్లూరు పంప్‌హౌజ్ 1600 క్యూసెక్కులకు పరిమితమైంది.
రూ. 15 కోట్లకు రూ. 2.70 కోట్లే విడుదల
ఎల్లూరు పంప్‌హౌజ్ ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంక్వైరీ చేయిస్తామన్న గత ప్రభుత్వం విచారణను పక్కకు పెట్టింది. పూర్తిగా దెబ్బతిన్న మూడో పంప్, సర్జ్ పూల్, పంప్‌హౌజ్ మధ్య రాక్ లెడ్జర్ గోడ బీటలు వారి లీకేజీ సమస్యతో ఐదో పంపును పూర్తిగా పక్కకు పెట్టేశారు. రెండు పంపుల రిపేర్లు,హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.15 కోట్లు అవసరం అవుతాయని ఇంజినీరింగ్ ఆఫీసర్లు అంచనా వేయగా, గత ప్రభుత్వం నాలుగేళ్లలో రూ. 2.70 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
పంప్‌హౌజ్ నిర్వహణ కాంట్రాక్ట్ చూసే పటేల్ కంపెనీని తప్పించి చిన్నా చితక కంపెనీలకు పనులు అప్పగించారు. బీహెచ్‌ఈఎల్ కంపెనీ ప్రతినిధులు నాలుగైదు సార్లు ఎల్లూరును విజిట్ చేసి డ్యామేజీ ప్రపోజల్స్‌ను ప్రభుత్వానికి ఇచ్చినా వాటిని పక్కకు పడేశారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎల్లూరు పంప్ హౌజ్ పునరుద్దరణకు నోచుకోలేదు.
శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు
ఎల్లూరు పంప్‌హౌజ్‌కు మిషన్ భగీరథ స్కీం లింక్ కావడంతో పంపుల రిపేర్లు చేపడితే ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తుతుందన్న ఉద్దేశ్యంతో పంపులను బాగు చేయకుండా నాలుగేండ్లు పక్కన పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో మంత్రి జూపల్లి, జిల్లా ఎమ్మెల్యేలు ఎల్లూరు పంప్‌హౌజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారు. వానాకాలంలో కృష్ణా నదికి వరద ప్రారంభమైన తర్వాత పనులు చేపట్టడం కష్టమని ఆఫీసర్లు తేల్చారు.
అయితే హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, రెండు పంపులను బాగు చేయడంతో పాటు కాల్వలను పునరుద్ధరించడం, నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు లింక్ చేస్తే ఎల్లూరు పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం ఎస్టిమేట్లు తయారు చేస్తే సీఎంతో మాట్లాడి నిధుల సమస్య రాకుండా చూస్తానని మంత్రి జూపల్లి ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచించారు.