కాంగ్రెస్ తో కొలిక్కిరాని చర్చలు  .. లెఫ్ట్ పార్టీల మొదటి జాబితా రెడీ!

  • అక్టోబర్ 1 లేదా 2న  ప్రకటించే చాన్స్
  • కాంగ్రెస్ తో కొలిక్కిరాని చర్చలు  
  • ఒకవేళ పొత్తు కుదిరితే స్థానాలు మార్చుకోవాలని నిర్ణయం

హైదరాబాద్,వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సీపీఎం, సీపీఐ నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్​తో పొత్తుపై క్లారిటీ రాకపోవడంతో తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించాలని భావిస్తున్నాయి. అక్టోబర్ 1 లేదా 2న ఫస్ట్ లిస్టును ప్రకటించేందుకు రెడీ అయ్యాయి. ఒకవేళ కాంగ్రెస్​ తో పొత్తు కుదిరితే, ప్రకటించిన స్థానాల్లో మార్పులు అవసరమైతే చేయాలని యోచిస్తున్నాయి. వచ్చే నెలలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య నెల రోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. 

ఒకట్రెండు సార్లు కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపారు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే అనుకున్నట్టుగా తమకు బలమున్న చోట కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే చెరో15–20 స్థానాలను ఆయా పార్టీలు గుర్తించాయి. కాంగ్రెస్ నుంచి పొత్తులపై స్పష్టత రాకపోవడంతో పోటీ చేసే సీట్లను ప్రకటించాలని భావిస్తున్నాయి. అక్టోబర్1 లేదా 2న సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రెండు పార్టీల నేతలు సమావేశం కానున్నట్టు తెలిసింది. ఈ మీటింగ్ లో చెరో ఐదుగురు అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 

ALSO READ: బావా బామ్మర్దుల..సుడిగాలి పర్యటనలు 

 ఇప్పటికే ప్రచారం షురూ..

సీపీఎం, సీపీఐ ప్రధానంగా కేంద్రీకరించిన పలు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయా పార్టీల నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. పాలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, హుస్నాబాద్ నుంచి సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు ప్రచారంలోకి దిగారు. వీరితో పాటు మిగతా కొన్ని స్థానాల్లోనూ ఆయా పార్టీల నేతలు విస్తృతంగా తిరుగుతున్నారు.