సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం(జీఎస్ఎల్) నిర్మించిన ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్‌ను రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్‌సేథ్ ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు అప్పగించారు. ఇందులో 72శాతం నిర్మాణ పనులు ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయంగానే పూర్తిచేశారు. అవాంఛిత శక్తుల నుంచి సముద్ర తీరాన్ని కాపాడటంలో కోస్ట్ గార్డ్ కీలక పాత్ర పోషిస్తున్నది.
సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, అందులోనూ ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జల చరాలను కాపాడేందుకు దోహదపడేలా అధునాతన సాంకేతికత ఈ నౌకలో ఉంది. ఈ నౌక పొడవు 114.5 మీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు ఉంటుంది. 4170 టన్నుల వరకు స్థానభ్రంశం చెందుతుంది. ఇందులో 14 మంది అధికారులు, 115 మంది నావికులు ఉండనున్నారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రూ.583 కోట్లతో రెండు కాలుష్య నియంత్రణ నౌకలను నిర్మించడానికి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నౌకలను స్వదేశీ పద్ధతిలో నిర్మించడం ఇదే తొలిసారి.