తొలి సత్యాగ్రహి వినోబా భావే.. ఇవాళ (ఏప్రిల్ 18) భూ దాన్​ డే

 తొలి సత్యాగ్రహి వినోబా భావే.. ఇవాళ (ఏప్రిల్ 18)  భూ దాన్​ డే

భా రతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశమంతా ఒక రకమైన పరిస్థితులు ఉంటే, దక్షిణ భారత దేశంలోని అప్పటి మద్రాస్​ రాష్ట్రంలోని ఆంధ్రా, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయని వినోబా తెలుసుకుని, వాటిని నిశితంగా పరిశీలించారు.  తాను జరపాలని కోరుకుంటున్న స్వచ్ఛంద ‘భూసేకరణ–భూవితరణ’ పోరాటానికి ఈ ప్రాంతమే అనువైనదని ఆయన ఎంచుకున్నారు.   

1951 ఏప్రిల్​ 9,10,11 తేదీల్లో హైదరాబాద్ శివారులోని శివరాంపల్లిలో జాతీయ సర్వోదయ 3వ వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకి దేశ నలుమూలల నుంచి పలువురు ప్రముఖ గాంధేయవాదులు, సర్వోదయ క్రియాశీలక నాయకులు హాజరయ్యారు. ఈ సదస్సు చివరి రోజున తాను భారతదేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛంద భూదాన్’ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు ఆచార్య వినోబా భావే. 

అది కూడా ప్రజలు స్వచ్ఛంద భూపోరాటానికి సిద్ధపడుతున్న  తెలంగాణ  ప్రాంతం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీనిలో భాగంగా ఆచార్య వినోబా తన సహచరులతో కలిసి 1951 ఏప్రిల్​ 15న శివరాంపల్లి నుంచి పాదయాత్రగా కదిలి గ్రామ గ్రామాలను సందర్శిస్తూ ఏప్రిల్​ 17 రాత్రి వరకు అప్పటి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి అనే ఒక గ్రామానికి చేరుకున్నారు. 

గాంధేయ విధానం సామరస్యం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్ట్​ నాయకుల ఆధ్వర్యంలో భూమిలేని ప్రజలందరూ భూమికోసం భూస్వాముల మీద తిరుగుబాటు చేయాలని ఒక ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అటువంటి క్లిష్ట సమయంలో ఆచార్య వినోబా ఆ గ్రామానికి వెళ్లడంతో భూమిలేని గ్రామస్తులంతా ఆయన దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుకున్నారు.  ఏప్రిల్​ 18, 1951న పోచంపల్లి  గ్రామ నాయకుల ద్వారా వెదిరే రామచంద్రారెడ్డికి కబురు పంపించి.. ఆయనే స్వయంగా వెళ్లి ఆ భూస్వామిని కలిసి మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి.. స్వాతంత్ర్యం సిద్ధించే వరకూ జరిగిన సంఘటనలన్ని ఆ భూస్వామికి ఆచార్య వినోబా  వివరించారు. 

 ‘ప్రాణాలను పణంగా పెట్టి మనం సాధించుకున్న స్వాతంత్ర్యం మరలా ప్రజల తిరుగుబాట్లు, అంతర్యుద్ధాల వల విచ్ఛినం కావడం సబబేనంటారా చెప్పండని ఆ భూస్వామిని ప్రశ్నించారు.   మీ గ్రామంలో మీరు వేలాది ఎకరాల భూమిని కలిగి ఉన్న భూస్వామి. అలాగే మీ కళ్లముందే ఒక సెంటు భూమి కూడా లేని నిరుపేద కుటుంబాలు ఎన్నో కష్టాలతో జీవిస్తుండటం మీరు చూస్తున్నారు.  కనుక, మీరు పెద్ద మనస్సు చేసుకుని సహృదయంతో స్వచ్ఛందంగా కొంతభూమిని ఆయా కుటుంబాలవారికి వ్యవసాయం చేసుకోవడానికి దానంగా ఇస్తే మీరు చరిత్రలో  దాతృత్వం కలిగిన దాతగా మిగిలిపోతారు’ అని చెప్పారు.

ఆచార్య వినోబా భావే భావోద్వేగ ప్రసంగానికి చలించిపోయిన పోచంపల్లి జమీందార్​ వెదిరే రామచంద్రారెడ్డి తక్షణమే పోచంపల్లి గ్రామంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు పంచడానికి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే దాన పత్రాన్ని సిద్ధంచేసి వినోబా భావేకు అందించారు. ఇది భారతదేశంలోనే తొలి స్వచ్ఛంద భూదానంగా ప్రకటితమైంది. ఆయనను వినోబా భావే అభినందించి ఆ భూమిని తక్షణమే కుటుంబానికి 2 ఎకరాలు చొప్పున అధికారుల సమక్షంలో ఆ గ్రామంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు అప్పగించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత భారతదేశంలోనే మొదటిసారి అధికారికంగా ‘స్వచ్ఛంద భూదానం–వితరణ’ జరిగిన రోజే  1951 ఏప్రిల్​18. అందుకే, ఆ రోజును భారతదేశ సామాన్య ప్రజలంతా ‘భూదాన్​ డే’గా జరుపుకుంటున్నారు. 


- ఎన్. రాంబాబు నాయుడు,
అధ్యక్షుడు,
ఏపీ సర్వోదయ మండల్