ఇప్పటి వరకు మనం మోటార్ వెహికల్స్, రైళ్లు, మెట్రో ట్రైన్స్ టన్నెల్ వే (సొరంగ మార్గం)లో ప్రయాణించడం చూశాం. కానీ పెద్ద పెద్ద షిప్‌లు సొరంగాల్లో ప్రయాణం చేయడం ఎప్పుడూ, ఎవరూ విని ఉండరు. ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించబోతోంది నార్వే దేశం. నార్వేలోని స్టాడవెట్ సముద్రంలో వాయవ్య ప్రాంతంలో తుఫాన్లు, హరికేన్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి. దీంతో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే షిప్‌లు రోజుల తరబడి లంగర్ వేసి ఒక చోట ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ‘ఈ ప్రాంతంలో సముద్రంలోకి సన్నగా విస్తరించి ఉన్న భూభాగంలో పెద్ద పర్వతం ఉంది. దాన్ని తొలిచి సొరంగం నిర్మిస్తే సముద్రంలో చుట్టూ తిరిగి వచ్చే పని తప్పిపోతుంది. వాతావరణం బాగోనప్పుడు రోజుల తరబడివేచి ఉండాల్సిన పని కూడా ఉండదు. అందుకే షిప్ టన్నెల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది పూర్తయితే నార్వేలో ఒక వైపు తీరం నుంచి మరోవైపు తీరానికి ఈజీగా హరికేన్ల ప్రభావం లేకుండా పెద్ద పెద్ద షిప్‌లు చేరుకోగలుగుతాయి’ అని నార్వే కోస్టల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉందని, ఎట్టకేలకు ఇప్పుడు నిర్మాణానికి అన్ని అనుమతులు క్లియర్ అయ్యి, డిజైన్స్ కూడా రెడీ అయ్యాయని తెలిపింది. ఆ డిజైన్స్‌కు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేశారు.
భారీ కార్గో షిప్‌లు కూడా ప్రయాణం చేయగలిగేలా ఓ టన్నెల్ నిర్మించబోతున్నట్లు నార్వే చెబుతోంది. ప్రపంచంలో ఒక ఇంజనీరింగ్ వండర్‌గా నిలవబోయే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మొదట్లో స్టార్ట్ చేయనుంది. దీనిని 2025–26 మధ్య పూర్తి చేయాలని ఆ దేశం టార్గెట్‌గా పెట్టుకుంది. స్టాడవెట్ సముద్రం మధ్యలో చొచ్చుకుని వచ్చినట్లుగా ఉండే నార్వే భూభాగంలో ఉన్న కొండను తవ్వి ఈ సొరంగం నిర్మించబోతున్నారు. ఇది 51 వేల అడుగుల మీటర్ల పొడవు, 1,120 అడుగుల ఎత్తు, 775 అడుగుల వెడల్పు ఉండేలా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.2,390 కోట్లు (33 కోట్ల డాలర్లు) ఖర్చవుతుందని నార్వే అధికారులు అంచనా వేస్తున్నారు. సొరంగం నిర్మాణంలో భాగంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ రాళ్లను తొలగించాల్సి వస్తుంది. ఈ టన్నెల్‌లోకి ఎంట్రీ, ఎగ్జిట్‌కు సంబంధించి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు.