
కరోనా మళ్లా కమ్మేస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి మరింతగా ఎక్కువైంది. గడిచిన మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,477 కొత్త కేసులు నమోదయ్యాయి. సెలవులకు సిటీలు, టౌన్ల నుంచి లక్షలాది జనం ఊర్లకు వెళ్లడం, ప్రయాణాలు, వేడుకల్లో కరోనా రూల్స్ పాటించకపోవడం వల్లే కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. వైరస్ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో టెస్టుల కోసం జనం బారులు తీరుతున్నారు. ఇదిలాఉండగా, హైదరాబాద్లోని అత్తాపూర్కు చెందిన నావల్, వ్యాస్ దంపతులకు ఐదు రోజుల కింద పాప పుట్టింది. రెండు రోజులుగా పాపకు తీవ్రంగా జ్వరం వస్తుండటంతో.. కరోనా సోకిందన్న అనుమానంతో మంగళవారం హైదరాబాద్ కింగ్ కోఠి హాస్పిటల్కు బేబీని తీసుకువచ్చి కరోనా టెస్టు చేయించారు.