
వెలుగు, ఖమ్మం: శని, ఆదివారాల్లో భారీ వర్షానికి రెండు రోజులు ఉగ్రరూపం దాల్చిన ఖమ్మంలోని మున్నేరు వాగు మంగళవారం శాంతించింది. దీంతో మున్నేరు వెంట ఉన్న బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, మోతెనగర్, ప్రకాశ్నగర్, కవిరాజ్ నగర్, మంచికంటి నగర్, పంపింగ్ వెల్ రోడ్డు తదితర 30 కాలనీల నుంచి వరద వెనక్కిపట్టింది. నాలుగు రోజులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆయా కాలనీవాసులు ఎట్టకేలకు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. వరద నీరు తగ్గడంతో ప్రభుత్వ షెల్టర్హోమ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఇండ్లలో పేరుకుపోయిన బురదను తొలగించే పనిలో తలమునకలయ్యారు.