ప్రాజెక్టులకు జలకళ..శ్రీశైలంలో 873 అడుగులు దాటిన నీళ్లు

ప్రాజెక్టులకు జలకళ..శ్రీశైలంలో 873  అడుగులు దాటిన నీళ్లు

 

  • ఎగువ రాష్ట్రాల్లో వానలతో కృష్ణాకు వరద తాకిడి
  • 510 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టం
  • జూరాలకు కొనసాగుతున్న ఫ్లడ్​ 
  • శ్రీశైలంలో 873  అడుగులు దాటిన నీళ్లు  
  • రేపు గేట్లు ఓపెన్​..రైతుల్లో హర్షం
  • పెరుగుతున్న ‘శ్రీరాంసాగర్’  

హాలియా/గద్వాల/శ్రీశైలం, వెలుగు : రాష్ట్రంలో వర్షాలు తగ్గినా పక్క రాష్ట్రాల్లో ఇంకా కురుస్తుండడంతో ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. దీంతో అక్కడి ప్రాజెక్టులన్నీ నిండడంతో గేట్లు ఎత్తుతున్నారు. దీంతో మన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో గేట్లను మంగళవారం తెరిచేందుకు ఏపీ ఇరిగేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల18వ తేదీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి భారీ స్థాయిలో ఇన్​ఫ్లో నమోదవుతూ వస్తోంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో శనివారం జూరాల ప్రాజెక్టు దగ్గర 44 గేట్లను ఎత్తగా ఆదివారం మూడు గేట్లు బంద్​ చేశారు. ఆల్మట్టి డ్యాం నుంచి 3 లక్షల 25 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ డ్యామ్ నుంచి 3,27,366 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు ఫుల్ ​కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7,971 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని 41 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 2,75,538 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 18,922 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 1500 క్యూసెక్కులు, భీమా--–1కు 1300, భీమా–--2కి 750, సమాంతర కాలువకు 300, లెఫ్టు కెనాల్ కు 870, రైట్ కెనాల్ కు 596 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా జూరాల నుంచి 2,98,866 క్యూసెక్కులను రిలీజ్​చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కు ల ఇన్ ఫ్లో వస్తున్నది. 

మరోవైపు నాలుగు రోజులుగా సుంకేసుల బ్యారేజ్ నుంచి కూడా భారీ వరద శ్రీశైలం వచ్చి చేరుతోంది.  ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి కలిపి 4,34,483 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నాయి. శ్రీశైల ప్రాజెక్టు జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ కుడి , ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి మొత్తం 54 వేల క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్​కు విడుదలవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ కెపాసిటీ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం152.83 టీఎంసీలకు చేరుకుంది. వరద ఇలాగే కొనసాగితే సోమవారం రాత్రి వరకు ఫుల్ కెపాసిటీకి చేరుకునే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం ప్రాజెక్టు వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి గంగాహారతి సమర్పించిన తర్వాత ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అధికారులు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్​కు నీటిని విడుదల చేయనున్నారు.  ఇప్పటికే నాగార్జునసాగర్ ​కళకళలాడుతోంది. శ్రీశైలం గేట్లు ఎత్తితే మరింత వరద పెరిగే అవకాశం ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు(312.5050 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రం వరకు 510.20 అడుగుల(132.0098 టీఎంసీలు)కు చేరుకుంది. కుడికాలువకు 6041 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ కి 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్​ఫ్లో 53,774  క్యూసెక్కులు ఉండగా, ప్రాజెక్టు నుంచి 6,441 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

ఆయకట్టు రైతుల్లో ఆనందం

సాగర్ జలాశయానికి ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతంలో రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవనున్నందున సాగర్ డ్యామ్​కు మరింత వరద పెరిగే అవకాశం ఉంటుందని ఆనందపడుతున్నారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ ఎడమకాల్వ పరిధిలో ప్రభుత్వం గ్రాఫ్ హాలిడే ప్రకటించింది. దీంతో సాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరిసాగు చేయలేకపోయారు. కానీ, ఈ ఏడాది ముందస్తుగానే జూలైలో కృష్ణా బేసిన్​లో కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర్ డ్యాంకు వరద ఆశాజనకంగానే ఉంది. దీంతో సాగర్​ ఆయకట్టు రైతాంగం వరి సాగుకు ఆసక్తి చూపుతోంది.  వరదను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు మొదటి వారంలో సాగర్ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఎన్ఎస్ అధికారులు భావిస్తున్నారు.  

ఎస్​ఆర్​ఎస్​పీలో 33 టీఎంసీలు   

బాల్కొండ/రామడుగు:  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు,(80.50టీఎంసీలు)కాగా, ఆదివారం సాయంత్రానికి 1075.00 అడుగుల (32.89 టీఎంసీల)కు చేరుకుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 26.80 టీఎంసీల వరద వచ్చింది.   మరోవైపు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌ గాయత్రి పంప్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌కు నాలుగు బాహుబలి పంపుల ద్వారా గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌కు 1.2 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. తగ్గుతున్న గోదావరి నీటిమట్టం. 

భద్రాచలం/ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్​ వద్ద గోదావరి వరద తగ్గు ముఖం పడుతోంది. శనివారం ఉదయం 10 గంటలకు 16.020 మీటర్లున్న వరద ఆదివారం ఉదయానికి  14.810 మీటర్లకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. భద్రాచలం వద్ద ఆదివారం నుంచి గోదావరి తగ్గుముఖం పట్టింది. శనివారం గరిష్టంగా 53.9 అడుగుల వరకు వచ్చిన వరద ఆదివారం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో 49 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద 
హెచ్చరిక ఉపసంహరించారు. అలాగే రాత్రి  9 గంటలకు 47. 8 అడుగుల వద్దకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను వాపస్​తీసుకున్నారు. దిగువన శబరి కూడా తగ్గుముఖం పట్టింది.