- మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి
నల్లగొండ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియన్ నేత, మాజీమంత్రి జానారెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నీట మునిగిన గ్రామాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువల భద్రతలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట సహాయంగా 15 వేల నుండి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. అలాగే నిడమనూరు నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులకు కూడా ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలన్నారు.
కనీస వసతులు లేని భవనంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం సిగ్గుచేటు
పెద్దవూర మినీ గురుకుల పాఠశాలను కనీస వసతులు లేని బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటుగా ఉందని మాజీ మంత్రి జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాన్ని పసిగట్టి మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సురక్షితంగా కాపాడిన అధికారులను, పోలీసు ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిడమనూరుని అభివృద్ధి చేయలేదని మీడియా ముందు గొప్పలు చెప్పుకునే వాళ్లు నిడమనూరుకి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండిపడి నష్టపోయిన వారందరికీ తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని, వరద బాధితులను ఆదుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.