నల్లమల సంరక్షణలో వారిదే కీలక పాత్ర
వన్యప్రాణులతో నిత్యం సహవాసం
చచ్చినా పట్టించుకునే దిక్కుంటలేదు..
కనీస వేతనం, భద్రత కూడా కరువే..
మద్దిమడుగు(నాగర్ కర్నూల్), వెలుగు : నల్లమల సంరక్షణలో కీలకంగా పనిచేస్తున్న వాచర్లను ఫారెస్ట్ శాఖ పట్టించుకోవడం లేదు. కుటుంబాలను వదలిపెట్టి నిత్యం వన్యప్రాణాలు, స్మగ్లర్లు, కార్చిచ్చులతో సహవాసం చేసే వాళ్లకు ఎలాంటి భద్రత కల్పించడం లేదు. చిట్టడవిలో తిండీతిప్పలు లేకుండా రోజుల తరబడి గడిపే వారికి కనీస జీతభత్యాలు కూడా ఇవ్వడం లేదు. జంతువుల దాడిలోనో, ఇతర ప్రమాదాల్లోనో చనిపోతే.. కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, బీమా లాంటి సౌకర్యాలు కూడా అందించడం లేదు. ఇప్పటి వరకు అప్పర్ ప్లాట్ ఏరియాలో 15 మందికిపైగా చనిపోయినట్లు ఫారెస్ట్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు, పోడు పంచాయితీలోనూ వీళ్లే బలవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఆదేశాల మేరకు పోడు సాగును అడ్డుకోవాల్సి రావడంతో స్థానిక రైతులతో శత్రుత్వం పెరుగుతోంది.
3 బ్లాకులు.. 276 బేస్ క్యాంపులు
నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్) 2611 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీన్ని మూడు బ్లాకులు, అచ్చంపేట, అమ్రాబాద్, మన్ననూర్, దోమలపెంట, లింగాల, మద్దిమడుగు, కొల్లాపూర్ రేంజ్‌లు, 276 బేస్ క్యాంపులుగా విభజించారు. గతంలో నాలుగైదుకు మించని పెద్దపులులు 2022 చివరి నాటికి 24కు చేరాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, మనుబోతులు, తోడేళ్లు, నక్కలు లాంటి వన్యప్రాణులు వందల్లో, జింకలు, నెమళ్లు, అడవి పందులు ఇతర జంతువులు వేలల్లో, పక్షులు లక్షల్లో ఉన్నాయి. నల్లమలతో పాటు 130 కిలోమీటర్లకు పైగా పారుతున్న కృష్ణానది ఆధారంగా చేసుకొని ఇవి జీవనం జీవనం సాగిస్తున్నాయి.
300 మందికి 100 లోపే...
ఏటీఆర్ పరిధిలో లెక్కప్రకారం 300 వరకు ఫారెస్ట్ వాచర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం100 లోపే ఉన్నారు. దీంతో వీరిపైనే అదనపు భారం పడుతోంది. సరిపడా బీట్ ఆఫీసర్లు లేకపోవడం కూడా వీరిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫారెస్ట్ శాఖ ఇటీవల 50 మంది వరకు బీట్ఆఫీసర్లను నియమించగా ఒత్తిడి తట్టుకోలేక దాదాపు 25 మంది మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీన్నిబట్టే నల్లమలలో ఉద్యోగం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
పులిపై స్వారీలా!
వాచర్లపై ఉద్యోగం పులిపై స్వారీలా ఉంటోంది. ఒకసారి డ్యూటీకి వెళ్లారంటే వారంరోజుల పాటు అడవిలోనే ఉంటూ మద్దిమడుగు, పెట్రాల్ చేన్ బేస్ క్యాంప్‌తో పాటు కృష్ణా తీరప్రాంతాన్ని గస్తీ కాయాలి. గొన్న పెంట నుంచి మొదలయ్యే పెట్రోలింగ్ డ్యూటీ పెద్దరేవు, కసం రేవు, గీస గండి, గద్దలసిరి, ముత్యాలమ్మ గడ్డ, నల్లవాగు వరకు సాగించాలి. అడవి మధ్యలో నిర్మించిన సాసర్లలో జంతువులకు తాగునీరు సప్లై చేయడం, ఆర్‌ఎఫ్‌డీలు, మట్టిరోడ్ల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్యత కూడా వీరిదే. ఎప్పుడు, ఎక్కడ అడవి తగలబడినా ముందు వరుసలో వీళ్లే ఉండా లి. ఈ క్రమంలో అడవి జంతువులతో పాటు స్మగ్లర్లు దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.
జీతం నెలకు రూ.8,884
వాచర్లలో పెంటలు, తండాలు, గూడాల్లో ఉండే చెంచులు, గిరిజనులు, దళితులే ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరు పది, ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నారు. కానీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వీరిని కాంట్రాక్ట్ కింద నియమించుకొని ఏజెన్సీల ద్వారా నెలకు రూ.8,884 జీతం మాత్రమే ఇస్తోంది. ఇవి కూడా ఒక్కోసారి రెండు మూడు నెలల దాకా రావు. ఈ డబ్బులతోనే బైక్ మెయింటెనెన్స్‌తో పాటు కుటుంబాన్నీ పోషించుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యంతో చనిపోయినా పట్టించుకునే దిక్కుండడం లేదు. ఏజెన్సీలు ఇన్సూరెన్ డబ్బులు కట్టకపోవడంతో దానికీ నోచుకోవడం లేదు. వివిధ కారణాలతో ఇటీవల చనిపోయిన బయ్యన్న, బాలకృష్ణ, లక్ష్మణ్ కుటుంబాలకు పట్టించుకోకపోతే ఆఫీసర్లు, సిబ్బంది చందాలు వేసుకొని సాయం చేశారు.
ఈ ఫొటోలోని వ్యక్తి దేశావత్ లక్ష్మణ్(45), అమ్రాబాద్ మండలం ఇప్పలపల్లి. భార్య లక్ష్మి, నలుగురు పిల్లలు ఉన్నారు. మద్దిమడుగు బేస్ క్యాంప్‌లో వాచర్‌గా పనిచేస్తుండే ఇతను 2022 అక్టోబర్‌లో అనారోగ్యంతో చనిపోయాడు. కానీ, ఎలాంటి ఎక్స్ గ్రేషియా, ఇన్సూరెన్స్ రాలేదు. దీంతో భార్య కూలీపని చేసి కుటుంబాన్ని పోషిస్తోంది.
ఇతను పదర మండలం, ఫర్హాబాద్ పెంటకు చెందిన లింగయ్య (26). ఫర్హాబాద్ బేస్ క్యాంప్‌లో వాచర్‌గా పనిచేస్తున్న ఈయన రెండు నెలల కింద డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో చనిపోయాడు. భార్య, కొడుకు ఉన్నారు. ఫారెస్ట్ శాఖ నుంచి కుటుంబానికి ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ అందలేవు.