
-
నామ్కే వాస్తేగా క్రీడా ప్రాంగణాలు
-
హడావుడి చేసి చేతులు దులుపుకున్న ఆఫీసర్లు
-
ఫారెస్ట్ జాగాలో ఏర్పాటుపై అటవీ శాఖ అభ్యంతరం
-
కొన్ని చోట్ల కొనుగోలు సెంటర్లుగా మారిన గ్రౌండ్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హడావుడిగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం వివాదాస్పదంగా మారింది. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఫారెస్ట్ భూమిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని అటవీ శాఖఅధికారులు తొలగించారు. చండ్రుగొండ మండలంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నామ్కే వాస్తేగా మారాయని అంటున్నారు.
క్రీడలకు ఉపయోగపడతలే..
జిల్లాలోని 481 గ్రామపంచాయతీల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 402 గ్రామపంచాయతీల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. ఇంకా 79 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఏడాది కాలంగా కలెక్టర్ ఒత్తిడి చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారులు హడావుడిగా తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఏడాది దాటుతున్నా కంప్లీట్ కావడం లేదు. కొన్ని చోట్ల నామ్కే వాస్తేగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి నిధులు కాజేశారనే ఆరోపణలున్నారు. అన్నపురెడ్డిపల్లిలో ఫారెస్ట్ భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయగా, ఇది తమ జాగా అంటూ వారం రోజుల కింద అటవీ శాఖ అధికారులు క్రీడా ప్రాంగణం బోర్డుతో పాటు సామగ్రిని తొలగించారు. చండ్రుగొండ మండలం మద్దకూరులో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. చండ్రుగొండలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా అధికారులు హడావుడిగా ఆఫీసుల మధ్య క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన మైదానంలో క్రీడా పరికరాలు కనిపించడం లేదు.
బోర్డులు ఏర్పాటు చేసిన ఆఫీసర్లు క్రీడా పరికరాలు సంగతి మరిచారు. వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్, షటిల్, ఖోఖో వంటి ఆటలకు సంబంధించిన కోర్టులు లేకపోవడంతో క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కోసం ఆట పరికరాలు, కూర్చునేందుకు బెంచీలు కూడా లేవు. వాకింగ్ ట్రాక్ ఉన్న మైదానాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. గ్రౌండ్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో పశువులు, మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని చోట్ల చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతున్నాయి. క్రీడా ప్రాంగణాల పేరుతో రూ. వేలల్లో ఖర్చు పెట్టి రూ. లక్షల్లో బిల్లులు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి