ఖమ్మం టౌన్, వెలుగు : ఆయుధాలు లేకుండా అటవీ రక్షణ కోసం పనిచేస్తున్న తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే వెపన్స్ ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది గురువారం ఖమ్మంలో డ్యూటీలు బహిష్కరించి ర్యాలీ తీశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు హత్యకు కారకులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అటవీశాఖ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతకు ముందు డిమాండ్లను పరిష్కరించే వరకు అడవిబాట పట్టేది లేదని ఫారెస్ట్ రేంజర్స్,సెక్షన్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్లు విధులను బహిష్కరించి డీఎఫ్ఓ సిద్దార్ద్ విక్రమ్ సింగ్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. అంతకు ముందు గాంధీ చౌక్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఫారెస్ట్ ఆఫీసర్లు మాట్లాడుతూ శ్రీనివాసరావు ను పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారని, పశువుల కాపరుల దగ్గర తల్వార్ లాంటి మారణాయుధాలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. గొత్తి కోయలను అడవుల నుంచి వెనక్కు పంపించాలని, శ్రీనివాసరావు హత్యపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించేంత వరకు ఆఫీసులకే పరిమితమవుతామన్నారు. రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఎఫ్ఆర్ఓ, ఆఫీసు స్టాఫ్ పాల్గొన్నారు.