- ఆగ్రహంతో అటవీశాఖ ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత
అశ్వారావుపేట, వెలుగు : దేవుడి గుడి కోసం ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు అడవి నుంచి ఓ చెట్టును కొట్టుకురావడం, రూల్స్ఉల్లంఘించారంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది దాన్ని ముక్కలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ మతవిశ్వాసాలను దెబ్బ తీశారంటూ కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఫారెస్ట్ఆఫీసులోకి చొచ్చుకెళ్లి ఫర్నిచర్ధ్వంసం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెదవాగు ప్రాజెక్ట్ వద్ద గ్రామస్తులు గంగానమ్మ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి అవసరమైన ధ్వజస్తంభం కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి 35 అడుగుల చెట్టును కొట్టి తీసుకువచ్చారు. పలు గ్రామాల్లో ఊరేగించి ఏప్రిల్ ఐదో తారీఖున ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పర్మిషన్‌లేకుండా చెట్టు కొట్టారంటూ గురువారం రాత్రి గంగానమ్మ గుడి దగ్గరకు వచ్చారు. అక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని ముక్కలుగా కట్‌చేసి ట్రాక్టర్ ఫై ఫారెస్ట్ ఆఫీసుకు తరలించారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సుమారు 200 మంది శుక్రవారం ఆటోల్లో అశ్వారావుపేట చేరుకున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఫారెస్ట్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఫారెస్ట్ఆఫీసర్లు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ఆఫీసులోకి చొచ్చుకువెళ్లి కిటికీలు, ఫర్నిచర్ధ్వంసం చేశారు. దీంతో ఎస్సై రాజేశ్‌కుమార్ ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఘటనకు బాధ్యులైన వారు క్షమాపణ చెప్పాలంటూ గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి చేయి దాటి పోయే అవకాశం ఉండడంతో రేంజర్ రెహమాన్గ్రామస్తులకు నచ్చజెప్పారు. మళ్లీ ధ్వజస్తంభం కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పడంతో ఆందోళన విరమించారు. గ్రామస్తులు నిరసనకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి.