దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రైతు సమస్యలపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం తారుమారు కాగానే బీఆర్ఎస్ నాయకులు డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు జరిగిన రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులుగా అధ్యయన కమిటీని వేయడం అభినందనీయం. అయితే, ప్రస్తుత రైతుల సమస్యలకు మూల కారణం కేవలం ఈ ప్రభుత్వమే కారణంగా ఎత్తిచూపడం సరైనది కాదు.
ఎందుకంటే గత పాలకుల తాత్కాలిక నిర్ణయాలే కారణమనే విషయాన్ని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ గుర్తించకపోవడమే కాక, గుర్తించ నిరాకరించడం కూడా మిక్కిలి శోచనీయం. వారు వీరైనంత మాత్రాన, వీరు వారైనంత మాత్రాన ప్రజలు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేయడం ఒక్కసారిగా సాధ్యం కాదు. సమర్థవంతంగా నిర్వహించడం అంత సులభమేమీ కాదు. ఏదో తాము ప్రతిపక్షపాత్రను పోషిస్తున్నామని భుజాలు చరుచుకోవడం చూస్తుంటే ప్రతిపక్ష నాయకులు
ప్రజాసమస్యల పట్ల ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది.
తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల కాలం ప్రభుత్వంలో ఉన్నంతసేపు ప్రతి సమస్యకు ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలే ప్రధాన కారణమనే బూచిగా చూపారు. కారణమని ఆరోపించారు తక్షణ సమస్య నుంచి పారిపోయేందుకు విఫల ప్రయత్నం చేశారని నిస్సందేహంగా చెప్పవచ్చును.
2014 నుంచి 2022 వరకు జాతీయ క్రైమ్ బ్యూరో
(ఎన్బీసీ) లెక్కల ప్రకారం సుమారు 7,000 పైగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయని నమోదు అయ్యాయి. ఇందులో ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంపై పనిచేస్తున్న నిపుణులు వ్యాసాలు రాస్తే అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఒకానొక పత్రికలో రైతుల ఆత్మహత్యలు సున్నా అని, ఏమీ జరగలేదని వ్యాసం రాయడం సంబంధిత రంగంలో పనిచేసే నిపుణులను ఆలోచనపరులను ఆశ్చర్యానికి గురి చేసింది . ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వేసిన ఆత్మహత్యల కమిటీ నాటి మాజీ మంత్రి ఆధ్వర్యంలో వేయడం గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా ఉంది.
అబద్ధాలను నమ్ముకున్నారు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వాస్తవంగా గత ఏడాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో 230 రైతు ఆత్మహత్యలు జరిగితే, 400 రైతు ఆత్మహత్యలు జరిగినట్లు అబద్ధం చెప్పడం బరితెగింపే కదా. తెలంగాణ ప్రజలు తమ పదేళ్ల అప్రజాస్వామిక పాలనను అంత తొందరగా మరిచిపోతారనుకుంటే పొరపాటు అని వీరు గ్రహించినట్టు కనపడటం లేదు. అన్నీ మర్చిపోయి తమ పదేళ్ల పాలన ‘బంగారు తునుక’ దశాబ్దమని, ఎన్నికలలో ప్రజలే తప్పు చేశారని ఇప్పటికీ భావిస్తే వారి ఖర్మ అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఈ నాయకుల బుకాయింపులు చూస్తుంటే కుక్కతోక వంకర అనే సామెత గుర్తుకు వస్తున్నది.
హరిత విప్లవం కీలక పాత్ర
ఈ మధ్యకాలంలో రైతులు ఎండుమిర్చిని కాలబెట్టడం, పంట పొలాన్ని తగలబెట్టడం, టమాటలను రోడ్లమీద పారపోయడం చూస్తుంటే మనసు వికలమవుతున్నది. ఎందుకంటే భూమి దున్ని కలుపు తీసి ఎరువు మందులు వేసి క్రిమిసంహారక రసాయనాలు పిచికారి కొట్టి చేనును కంటిపాపలా చూసి తీరా పండిన పంటను మార్కెట్కు తీసుకువస్తే భూమిలేని పంట పండించని దళారీ వ్యవస్థ రింగుగా ఏర్పడి రేటును తక్కువగా నిర్ణయించి రైతులను నిలువునా ముంచుతున్నారు. ఈ రైతు సమస్యల మూలాలను వెతుకుతుంటే కొన్ని వివిషయాలు గుర్తొస్తున్నాయి.
దేశం ఎదుర్కొంటున్న ఆహార కొరత పరిష్కారానికి శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో 1965 సంవత్సరంలో దేశంలో హరిత విప్లవం ప్రారంభమైనది. ఆయన సూచనల మేరకు వ్యవసాయ రంగంలో సంప్రదాయ పద్ధతుల స్థానంలో ఆధునిక పద్ధతులు,కొత్త రకం వంగడాలు, రసాయన ఎరువులు పురుగు మందులు అవలంబించాలని సూచించి అమలుపరిచారు. దేశం ఆహార ఉత్పాదకతలు స్వయం సమృద్ధి సాధన కోసం హరిత విప్లవం ముఖ్య పాత్ర పోషించింది.
వ్యవసాయ రంగంలో సంక్షోభం
అయితే ఆశ్చర్యంగా దేశం ఆయా ప్రణాళికల కాలంలో అవలంబించిన లక్ష్యాల సాధనలో, ప్రధానంగా వ్యవసాయ దేశమైన మన దేశం క్రమంగా పారిశ్రామీకరణ కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నిర్ణయాల వలన క్రమంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడినది. దేశంలో 1970 నుంచి రైతు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనది . దీనికి ప్రధాన కారణం అధిక వడ్డీకి ప్రైవేటు అప్పులు, చెల్లింపుల ఒత్తిడి, వ్యవసాయంలో పెరిగిపోయిన వ్యయం వెరసి తడిసి మోపెడై రైతులపైన పెనుభారం ఎక్కువైనది.
క్రమంగా ఈ అల్పపీడనం తుపానుగా మారి 1980 నుంచి వ్యవసాయ రంగంలో సంక్షోభం తీవ్రరూపం దాల్చి దేశం మొత్తంలో రైతుల ఆత్మహత్యలు లక్షలు దాటిపోయినది. సంక్షోభ నివారణ కోసం తిరిగి స్వామినాథన్ కమిటీని ప్రభుత్వం నియమించగా అనేక సూచనలు చేసింది. అందులో భాగంగానే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వచ్చింది.
కంచే చేను మేసిన చందంగా బీఆర్ఎస్
కౌలుదారుడిని కిరాయిదారునిగా అభివర్ణించి కౌలు రైతులకు ఏ మాత్రం ప్రభుత్వ ఆర్థిక సహాయం అందకుండా చేసింది కేసీఆర్ సర్కారు. దాంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతులను ఆత్మహత్యల వైపు మరింత పురికొల్పినట్టు అయింది. బీఆర్ఎస్ పాలనా హయాంలోనే సుమారు 8 వేల వరకు రైతు ఆత్మహత్యలు జరిగాయి. అవన్నీ మర్చిపోయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రైతుల ఆత్మహత్యలపైన అధ్యయన కమిటీ వేయడం చూస్తే కంచే చేను మేసిన చందంగా ఉన్నది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది.
- జూకంటి జగన్నాథం,కవి, రచయిత-