రేవల్లి, వెలుగు : మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తనను మోసం చేయడంతో అప్పుల పాలయ్యానని వనపర్తి జిల్లా రేవల్లి మండలం గొల్లపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ లక్ష్మి వాపోయారు. మంగళవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎదుట ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తనకు ఇల్లు లేదని, తన భర్త వికలాంగుడు కావడంతో ఇల్లు మంజూరు చేస్తానని మాజీ మంత్రి చెప్పాడని తెలిపారు. ఆయన హామీతో ఇంటి పనులు మొదలుపెట్టి రూ.10 లక్షలు అప్పు చేశానని చెప్పారు.
సాయం చేస్తానని చెప్పి మాజీ మంత్రి ముఖం చాటేశాడని పేర్కొన్నారు. కాగా, గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని చెప్పారు. మాజీ ఉప సర్పంచ్ లక్ష్మికి కూడా ఇంటి బిల్లు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప సర్పంచ్ గా ఎన్నికైన లక్ష్మికే మాజీ మంత్రి న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కొత్త బిల్డింగులు నిర్మిస్తామని తెలిపారు.