రూ.50 కోట్లు దారి మళ్లాయ్..! మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారం

రూ.50 కోట్లు దారి మళ్లాయ్..! మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారం

హైదరాబాద్: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్లో ఇచ్చిన ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ రూ.55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేయడం గమనార్హం. ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విచారణకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. పోటీల నిర్వహణకు ఏక పక్షంగా చెల్లింపులు జరగడం, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంపై మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. 

గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‎లోని ట్యాంక్ బండ్‎పై ఫార్ములా ఈ రేసింగ్‎ను నిర్వహించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.8 కిలో మీటర్ల ట్రాక్ నిర్మించి ఫిబ్రవరి 11వతేదీ 2023న మొదటిసారి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి10న నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్‎తో బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‎లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు సదరు సంస్థకు బదిలీ అయ్యాయి.  డిసెంబర్‎లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. సర్కారు నిబంధనలు పాటించకపోవడంతో హైదరాబాద్‎లో ఈ రేస్ నిర్వహించడం లేదని ఎఫ్ఈవో ప్రకటించింది.

అప్పటి కేబినెట్ అప్రూవల్ లేకుండా, కేవలం అప్పటి మంత్రి కేటీఆర్ ఫోన్‎లో ఇచ్చిన ఆదేశాలతో రూ.55 కోట్లు విదేశీ సంస్థకు విడుదల చేయడం గమనార్హం. ఈ అంశం కలకలం రేపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా డబ్బును విదేశీ సంస్థకు విడుదల చేయడం దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ మున్సిపల్  శాఖ ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏం జరుగుతుందో అనేది హాట్ టాపిక్‎గా మారింది.