గొర్రెలతో ఆగకుండా గొంతెత్తాలి సీట్ల కోసం

ఒకే వృత్తిజేస్తూ, ఒకే దేవున్ని మొక్కే యాదవులు, ఉపకులాల జనాభా తెలంగాణలో 18 శాతం ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. యాదవులు గొర్రెల పథకంతో మాత్రమే సంతృప్తి పడి ఆగకుండా రాజ్యాధికారంలో వాటా కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. మూడు లోక్ సభ, 21 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ సీట్లు యాదవులకు కేటాయించేలా అధికార పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలకు అల్టిమేటం ఇయ్యాలె. 

బీపీ మండల్ కమిషన్  చేసిన నలభై సిఫార్సులు దేశంలోని అట్టడగు కులాల గతిని మార్చేశాయి. 54 శాతానికి పైగా ఉన్న కులాలు అభివృద్ధి చెందకపోతే దేశ భద్రతకు, పురోగతికి అవరోధం ఏర్పడుతుందని వివరించారు. అలా ఆయన కృషితో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు రావడంతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. కాన్షీరాం బహుజన రాజ్యాధికార నినాదం సాంప్రదాయ, వారసత్వ రాజకీయాలను బద్ధలు కొట్టింది. దళిత బహుజనులు కూడా అధికారంలోకి రాగలరని ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసి నిరూపించింది.

యాదవ మహాసభ ఏర్పాటు
తొంభై ఎనిమిది ఏండ్ల కింద1924 సంవత్సరంలో ఒకే వృత్తి, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయం కలిగిన ఒకే కులం వారు "అఖిల భారత యాదవ మహాసభ" గా ఏర్పడ్డారు. దేశంలోని ఇతర అణగారిన కులాలతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో ముందు భాగాన నిలిచారు. అనేక మంది వీరులను ఆ సమరానికి వారు అందించారు. యాదవ మహాసభ కృషి ఫలితంగానే బ్రిటీష్ రూలర్స్ 1931 సంవత్సరంలో కుల గణన చేపట్టాల్సి వచ్చింది. దాని ఫలితంగానే అట్టడుగు శ్రామిక కులాలవారు ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యే లుగా, కలెక్టర్లుగా, న్యాయమూర్తులుగా ఎదిగారు. ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి మొదలైన ఈ కల్చర్ అణగారిన కులాలను రాజకీయ బాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. నిజానికి అట్టడుగు కులాలు అధికారం పొందే స్థాయికి ఎదగడం అనేది సూటిగా సాగేది కాదు. అంతర్లీన క్రియాశీల ప్రక్రియ. ఆ రకంగా వచ్చిన అట్టడుగు కులాల చైతన్యం దుర్భేధ్యమైన కాంగ్రెస్, వారసత్వ రాజకీయాల కంచుకోటలను బద్ధలుకొట్టింది. ఫలితంగానే వివిధ రాష్ట్రాల్లో అట్టడుగు కులాలు, అణగారిన జాతులు రాజ్యాధికారంలోకి రాగలిగాయి. 

తోక సంఘంగా ఉంటే..
కుల సంఘాలు నిజానికి కుల నిర్మూలన కోసం పనిచేయడం లేదు. అవి వాటి స్వేచ్ఛను కోల్పోవడంతో రాజకీయ పార్టీలు వాటిని వాడుకుంటున్నాయి. ఏ అగ్రకులాధిపత్య, వారసత్వ రాజకీయాలను కూకటివేళ్లతో పెకలించారో అలాంటి జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కోసం, కులాలను సంఘటితం చేసే పనిముట్లుగా కుల సంఘాలు మారాయని చరిత్రకారుల విమర్శ కూడా ఉంది. సరిగ్గా ఇక్కడే కుల సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉన్నది. వాస్తవానికి రాజకీయ పార్టీల నేపథ్యం కలిగిన కుల సంఘాలతో ప్రయోజనం శూన్యం. రాజకీయ పార్టీలకు తోకలుగా ఉంటే అణగారిన కులాలకు వ్యతిరేకంగా వారు చేసే నిర్ణయాలను ప్రశ్నించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ చూడటానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలా కనిపించినప్పటికీ, దేశంలోని మెజార్టీ పార్టీలన్నీ ఏదో ఒక కులం ఆధిపత్యంలోనో, అగ్రకులాధిపత్యంలో నడుస్తున్నాయన్నది కాదనలేని సత్యం. కాబట్టి తోక సంఘంగా ఉంటే వారి కులాధిపత్య ధోరణికి విరుద్ధంగా మన జాతికి మనం ఏ విధమైన న్యాయం చేయలేం. ఒకరిద్దరి ప్రయోజనాల కోసమో, చిన్న చిన్న పదవుల కోసమో రాజీ పడకుండా తమ జాతి ప్రయోజనాల కోసం ఎవరు తపిస్తారో వారే విజయం సాధించినట్టు చరిత్ర రుజువుచేస్తున్నది. ఏ కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా నడుస్తాయో, ఏ కుల నాయకుడు వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా సుదీర్ఘ లక్ష్యంతో సంఘాన్ని స్వేచ్ఛగా నడిపిస్తారో అది జాతి ప్రయోజనాలకు అత్యంత మేలు చేకూర్చేదిగా మనగలుగుతుంది.

ఐక్యతగా ఉంటూ.. 
తెలంగాణలో యాదవులు, ఉపకులాల జనాభా18 శాతం ఉంది. ఈ సంఖ్యాబలం ఐక్యతతో ఉంటూ మిగతా బహుజన కులాల మద్దతు కూడా తీసుకోవాలి. యాదవుల్లో నుంచి చాలా మంది విద్యావంతులుగా, స్థితిమంతులుగా ఎదిగి వచ్చారు. వారంతా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తమ జాతిని ముందు వరుసలో నిలపడానికి యాదవ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేశారు. ఇదే వేదిక నుంచి యాదవుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గొర్రెల స్కీం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయమనాలి. ఇలా చేయడం వల్ల గొర్రెల అభివృద్ధితో పాటు యాదవుల కుటుంబాల్లో ఆర్థిక వృద్ధి పెరిగి చదువులు వెల్లివిరుస్తాయి. అవినీతి, కమీషన్ల దందా కూడా తగ్గుతుంది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలి. అగ్రకుల ఆధిపత్యం, భూస్వామ్య మనస్తత్వం కలిగినవారు అనేక చోట్ల వారి దగ్గర పనిచేసే దళిత సోదరులను రెచ్చగొట్టి, గొర్రెలు కాసుకునే వారిపై నమోదు చేయించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు ఎత్తివేయించాలి. గొర్రెల కాపరి, ఉన్ని తీయడం, గొంగళ్లు నేయడం వంటి పనుల్లో విద్యా, వృత్తి నైపుణ్యాలు నేర్పేందుకు ప్రత్యేక కేంద్రాలు పెట్టాల్సిందిగా కోరాలి. ఇప్పటికీ సంచార జాతులుగా ఉన్న యాదవులకు, ఉపకులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఎంతైనా అవసరం.

- చలకాని వెంకట్ యాదవ్, హైకోర్ట్ న్యాయవాది