తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 7300 మెగావాట్లు ఉండగా, ఉత్పత్తి 4300 మెగావాట్లు మాత్రమే ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. రాష్ట్రం రెండు ఏళ్లలో స్వయం సమృద్ధి, అలాగే 5 ఏళ్లలో విద్యుత్ లో మిగులు రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనా పరమైన అనుమతులు, అలాగే కావల్సిన నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ అమలులో అవకతవకలు జరగడంతో అనుకున్న ఫలితాలు రావడం లేదు. రాష్ట్రంలో 6000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కోసం టీఎస్ జెన్‌కో 2015 సంవత్సరంలో బి.హెచ్.ఇ.ఎల్.తో ఒప్పందం కుదుర్చుకున్నది. దాని ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో పని మొదలుపెట్టిన కొత్తగూడెం స్టేజీ –VII ప్లాంటును తొందరగా పూర్తిచేయుట అలాగే 1080 మెగావాట్ల సామర్థ్యంతో మణుగూరు వద్ద ‘భద్రాద్రి’ ప్లాంట్‌నిర్మాణం, అలాగే దామరచర్ల వద్ద ‘యాదాద్రి ’ 4000 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంటు నిర్మించుటకై ఒప్పందం కుదిరింది. మొదటి నుంచి జెన్ కో అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్న సమయానికి ఉత్పత్తి జరగలేదు. అదేకాక ఆర్థికంగా రాష్ట్రానికి చాలా భారం పడింది.
సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతున్న దోషం ఎవరిది?
బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి 2010 లో సాంకేతిక పరంగా వాడే సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉండేది. ఈ పద్ధతితో అధికంగా బొగ్గు వాడకం జరుగుటయే కాక పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. 2010 తరువాత సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకలోనికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2012 తర్వాత కొత్తగా నిర్మించే ప్లాంట్లు అన్నీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో మాత్రమే నిర్మించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2010లో ఇండియా బుల్ అనే సంస్థ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడానికి బి.హెచ్.ఇ.ఎల్. కు పరికరాల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుంది. 2012 లో కేంద్రం ఇచ్చిన ఆర్డర్‌తో, ఇండియా బుల్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం జరిగింది. కాని అప్పటికే కావల్సిన యంత్ర సామాగ్రి బి.హెచ్.ఇ.ఎల్ తయారు చేసింది. ఈ యంత్ర సామాగ్రి 5 ఏళ్ల నుంచి బి.హెచ్.ఇ.ఎల్ గోదాముల్లో పడి ఉంది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం బి.హెచ్.ఇ.ఎల్ తో భద్రాద్రి ప్లాంటు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుందో వెంటనే 5 ఏళ్ల నుంచి గోదాముల్లో ఉన్న పరికరాలు జెన్ కోకు పంపడం, ఆ వెంటనే జెన్‌కో బి.హెచ్.ఇ.ఎల్ కు 1056 కోట్లు చెల్లింపు చేయడం చకచకా జరిగిపోయినాయి. భద్రాద్రి ప్లాంటు నిర్మాణానికి కావలసిన అనుమతుల కొరకు కేంద్రానికి దస్త్రం పంపగా, సబ్ క్రిటికల్ పద్ధతిలో నుంచి సూపర్ క్రిటికల్ పద్ధతిలోనికి వెళ్లమని కేంద్రం ఆదేశించింది. దానికి జెన్‌కో అధికారులు తాము ఇంతకుముందే కాలసిన యంత్ర సామాగ్రి బి.హెచ్.ఇ.ఎల్. నుంచి కొనుగోలు చేశామని, ఇప్పుడు మార్చడం సాధ్యపడదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత రెండవ మీటింగ్‌లో కూడ కేంద్రం ఇదే అభ్యంతరం తెలుపుతూ మరొకసారి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడమని తెలిపింది. ఇక విద్యుత్ ప్లాంటు స్థలంలో ప్రజావిచారణ జరిగినపుడు, స్థానికులు కూడా సబ్ క్రిటికల్ నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలని, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో విపరీతమైన కాలుష్యం కలుగుతుందని తెలిపారు. ఇన్ని విధాల అభ్యంతరాలు ఉన్నప్పటికీ తెలంగాణ జెన్‌కో బి.హెచ్.ఇ.ఎల్ గోదాముల్లో తుప్పు పట్టిపోతున్న సబ్ క్రిటికల్ టెక్నాలజీ యంత్ర సామాగ్రితోనే ప్లాంటు పని మొదలుపెట్టారు. సరైన అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ప్రాజెక్టు పనులపై స్టే విధించడం జరిగింది. డిసెంబర్ 2015 నుంచి మార్చి 2017 వరకు స్టే ఉన్నా, ఇంజనీర్లు పనులు చేయడం, సంబంధిత ఇంజనీర్లపై ట్రిబ్యునల్ క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది.
భద్రాద్రి కి బొగ్గు రవాణాకు రైలు మార్గం ఎన్నటికి?
ఏప్రిల్ 2017 నుంచి పనులు మొదలైనాయి. భద్రాద్రి ప్లాంటు డీ.పీ.ఆర్. లో ప్లాంటుకు కావాల్సిన బొగ్గు 15 కి.మీ దూరంలో ఉన్న బొగ్గు గనుల నుంచి రైలు మార్గం ద్వారా రవాణా చేయడం జరుగుతుందని చెప్పబడింది. అయితే జెన్‌కో రకరకాల కారణాలతో రైలు మార్గం నిర్మించకుండా, ప్రతిరోజు13 వేల టన్నుల బొగ్గు రోడ్డు మార్గాన, ఎనిమిది ఆదివాసీ గ్రామాలను దాటుతూ రవాణా చేస్తున్నారు. దీనితో ఈ ఎనిమిది గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 10 వేల మంది ఆదివాసీలకు బొగ్గుధూళితో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే వారి పంటలకు కూడా నష్టం వాటిల్లుతున్నది. ఇది ఒక మానవహక్కుల ఉల్లంఘన. 2015లో భద్రాద్రి ప్లాంటు అంచనా వ్యయం రూ. 7290 కోట్లు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన ప్లాంటు రకరకాల తప్పుడు నిర్ణయాల వల్ల ఆరేళ్ల కాలం పట్టింది. దానితో ఖర్చు తడిసి మోపిడై 10 వేల కోట్లకు చేరింది.
విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ఏది?
ఇక యాదాద్రి ప్లాంటు రూ.25,000 కోట్ల అంచనా వ్యయంతో 2017లో పని మొదలైంది. ఇది 4 ఏళ్లలో పూర్తి కావాలని అంచనా. అయితే ఇప్పటి వరకు 50% పనులు కూడా పూర్తి కాలేదు. ప్లాంటు నిర్మాణ ఖర్చు కాస్తా రూ. 40 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ అప్పు ఇస్తున్నది. పనుల్లో ఆలస్యమైన కొద్దీ జెన్‌కో సాలీనా వెయ్యి కోట్ల పై బడి వడ్డీ చెల్లిస్తున్నది. 5 ఏళ్లలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తామని చెప్పినా, 8 ఏళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితి కేవలం 800 మెగావాట్ల కొత్తగూడెం, 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణం మాత్రమే జరిగింది. అంటే 6000 మెగావాట్ల ఉత్పత్తి 4 ఏళ్లలో చేయాలనుకుంటే 8 ఏళ్లు గడిచినా కేవలం 2000 మెగావాట్లకే పరిమితమైంది. 2014 తర్వాత కేంద్రం, రాష్ట్రాలు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో దేశంలో మిగులు ఉత్పత్తి ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకు కావల్సిన విద్యుత్తు ఉత్పత్తి చేయడం లేదు. ప్రస్తుతం 40% వరకు కావాల్సిన విద్యుత్తు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. జెన్ కో ఈ రెండు ప్లాంట్లపై సుమారు 50 వేల కోట్ల పైబడి ప్రజాధనాన్ని ఖర్చుచేస్తున్నది. దీనిపై ఒక శ్వేతపత్రం కావాలని అడుగగా బహుశా వారు చేస్తున్న అక్రమాలు బయటపడతాయనే భయంతో కాబోలు శ్వేతపత్రం విడుదల వీలుకాదని, అదీకాక శ్వేతపత్రం విడుదల చేసినా.. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని ఒక వితండ వాదన చేస్తున్నారు.
ఈ పది ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిందే..
1.సరియైన అనుమతులు లేకుండా తొందరపాటుగా పనులు ఎందుకు మొదలుపెట్టినారు ?
2.సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం వద్దని కేంద్రం పలుమార్లు చెప్పినా ఎందుకు వినలేదు ?
3.రెండేళ్లలో పూర్తి కావాల్సిన భద్రాద్రి 6 ఏళ్లు ఎందుకు పట్టింది ?
4. రూ.7290 కోట్లతో పూర్తి కావల్సిన ‘భద్రాద్రి’ పని 10 వేల కోట్లకు వెళ్ళింది. దీనికి బాధ్యులెవరు ?
5. ప్రస్తుతం విద్యుత్ సంస్థ సుమారు 45 వేల కోట్ల నష్టాల్లో ఉంది. దీనికి బాధ్యులెవరు ?
6. ఏ ఏ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు, వాటి ధర, అలాగే భద్రాద్రి ప్లాంటు ఉత్పత్తి చేసే యూనిట్ ధర ప్రజలకు తెలియజేయాలి.
7.రాష్ట్రానికి కావల్సిన విద్యుత్తు ఉత్పత్తి చేసుకోలేక సాలీనా సుమారు 40 వేల కోట్లు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారు. స్వయం సమృద్ధి ఎప్పటికి సాధ్యం?
8. భద్రాద్రికి ప్రతిరోజు కావల్సిన 13 వేల టన్నుల బొగ్గు రైలు మార్గం ద్వారా కాక, రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయడంతో ప్రతి నిమిషానికి ఒక లారీ రోడ్డుపై ప్రయాణం చేస్తుంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలకు ప్రమాదాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పంటలపై ప్రభావం వంటి వాటికి ఎవరు బాధ్యులు?
9. నత్తనడక నడుస్తున్న ‘యాదాద్రి’ ఎప్పుడు పూర్తి అవుతుంది?
10. ముఖ్యమంత్రి విద్యుత్ సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినా అనుకున్న రీతిలో పనులు జరగడం లేదు. విద్యుత్ సంస్థ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం లోపించింది.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శ్వేతపత్రం విడుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతున్నది.
- యం. పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్