తెలంగాణ ఉద్యమ పునాది బియ్యాల జనార్దన రావు

తెలంగాణ ఉద్యమ పునాది బియ్యాల జనార్దన రావు

ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన రావు తెలంగాణ సకల జనుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో బియ్యాల కిషన్ రావు, అంజనమ్మ దంపతులకు 1955, అక్టోబర్ 12న జన్మించారు. బాల్యంలోనే జనార్దన్ రావు కుటుంబం ఏజెన్సీ పాకాల కొత్తగూడెం మండలంలోని ఓటాయి గ్రామానికి వలస వెళ్ళడంతో ఆయన ఓటాయి వాసిగానే సుపరిచితుడు. పేద కుటుంబం, కష్ట నష్టాలు చదువుకు అడ్డం కాదంటూ తన పొరుగు గ్రామమైన సాధిరెడ్డిపల్లిలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. పదవ తరగతి నర్సంపేటలో, ఇంటర్ విద్య గోదావరిఖనిలో, డిగ్రీ వరంగల్ ఎల్బీ కళాశాలలో, ఎంఏ కాకతీయ యూనివర్సిటీలో చేశారు. 

చిన్ననాటి నుంచి తను ఏజెన్సీ గ్రామంలో నివసించడం మూలాన, ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధంతో వారి సంప్రదాయ వారసత్వ జీవన విధానమును ఆకళింపు చేసుకున్నారు. మరోపక్క ఏజెన్సీవాసుల భూములు, అటవీ వనరులు పరాయికరణ చెందడంతో ఆవేదన చెందారు. ఎలాంటి చైతన్యంలేని ఆదివాసీలకు చెందిన భూములు 1980లో 48 శాతం వలస గిరిజనేతరులు, పెత్తందార్లకు అన్యా క్రాంతమయ్యాయి. ఆయన 'గిరిజన భూముల పరాయీకరణ' అనే అంశంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్డీ పట్టా పొందారు. తదనంతరం 1990 నుంచి ప్రొఫెసర్​గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్​లో ఆదివాసీ ఉద్యమాలు, 1/70 చట్టం. ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమస్యలపై దృష్టి పెడుతూ... ఆదివాసులపై పరిశోధన చేసిన తొలి గిరిజనేతర వ్యక్తి. 2001 కాలంలో కాకతీయ యూనివర్సిటీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం డీన్​గా నియమితులయ్యారు.11 అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకర్తగా..

బియ్యాల మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి సిద్ధాంతకర్తగా కీలక భూమిక పోషించారు. తెలంగాణలో జరుగుతున్న వివక్ష, అణచివేతల గురించి అనేక రచనలు చేశారు. అదే కాలంలో ప్రొఫెసర్ జయశంకర్​తో కలిసి అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి అసమానతలు, ప్రాంతీయ అసమానతలపై ప్రసంగించి తెలంగాణ ఉద్యమానికి అంతర్జాతీయంగా సమ్మతిని కూడగట్టారు. సమైక్య రాష్ట్రంలో నీళ్లు-, నియామకాలు పంపిణీల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటిసారిగా లేవనెత్తిన ఘనత జనార్దన్ రావుకు దక్కుతుంది. సమైక్య పాలనలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాలు, ఎట్లా ఉల్లంఘించబడ్డాయో   ఎండగడుతూ... విద్యార్థులు, మేధావుల్లో ప్రచారం చేయడంలో ప్రొఫెసర్ జనార్దన్ రావుదే ప్రధాన భూమిక. జనార్ధన రావు ఒకరు తెలంగాణ కోరితే రాష్ట్రం ఏర్పడుతుందా? అన్న ప్రశ్నలను సైతం సంధించుకుని తన సహచరి ప్రొఫెసర్ రేవతి
తోడ్పాటుతో ముందడుగు వేశారు. మూడుతరాల ప్రతినిధి కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్​తో సమఉజ్జీగా నిలిచి వారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఉద్యమ పార్టీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

ALSO READ : కొత్త చట్టంలో ఎఫ్ఐఆర్

అలుపెరుగని సేవలందించారు

1999లో కన్నభిరామ్, ఎస్ఆర్ శంకరన్ తదితరులతో కలిసి ప్రభుత్వం తరపున నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలనే ఎజెండా ముందుకుతెచ్చారు. తెలంగాణ ఉద్యమానికి బియ్యాల ఎనలేని సేవలు చేశారు. బియ్యాల జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తపన పడ్డారు. గిరిజనుల స్వయం పాలన కోసం రాజరికపు వ్యవస్థపై వీరోచితంగా పోరాడి నేలకొరిగిన 'సమ్మక్క' జాతర జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ బియ్యాల 2002, ఫిబ్రవరి 27న ప్రకృతి ఒడిలో చేరిపోయారు. జనార్దన్ రావు ఉద్యమస్ఫూర్తి ఆదివాసీ గిరిజనుల గుండెల్లోనూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ సజీవంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ఉద్యమ కార్యకర్తగా, యావత్ తెలంగాణ ప్రజల మదిలో అనుక్షణం మెదులుతున్న బియ్యాలకు తెలంగాణలో సరైన గుర్తింపు లభించలేదు.

- గుమ్మడి లక్ష్మీనారాయణ, 
ఆదివాసీ రచయితల వేదిక