నాలుగు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు

నాలుగు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు


న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండు రోజులుగా 3 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇందులో సగానికిపైగా కేసులు నాలుగు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. శనివారం 3.37 లక్షల మందికి కరోనా సోకగా.. ఇందులో మహారాష్ట్రలో 48,270 మందికి, కర్నాటకలో 48 వేల మందికి, కేరళలో 45,136 మందికి, తమిళనాడులో 29 వేల మందికి పైగా పాజిటివ్ వచ్చింది. ఇక దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.89 కోట్లకు పెరగ్గా.. ఒమిక్రాన్ కేసులు 10 వేలు దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 21,13,365కి పెరిగినట్లు చెప్పింది. గత 24 గంటల్లో 488 మంది చనిపోయినట్లు పేర్కొంది. రికవరీ రేటు 93.31 శాతానికి పడిపోగా, యాక్టివ్ కేసులు 5.43 శాతానికి పెరిగాయి. డైలీ పాజిటివిటీ రేటు 17.22 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 16.65 శాతంగా ఉన్నాయి.

ఆస్పత్రుల్లో చేరేటోళ్లు చాలా తక్కువ

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌‌‌‌లతో పోలిస్తే.. ప్రస్తుతం ఆస్పతుల్లో చేరేటోళ్లు, ఐసీయూ, ఆక్సిజన్ అవసరం ఉన్నోళ్లు చాలా తక్కువగా ఉంటున్నారని ఓ స్టడీలో తేలింది. మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటళ్లలో చేరిన పేషెంట్లపై ఈ స్టడీ చేశారు. మూడు వేవ్​లలో అడ్మిషన్లు, ఐసీయూ అవసరం, మరణాల రేటును పోల్చి చూశారు. ‘‘సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌లో ఢిల్లీలో రోజుకు 28 వేల మందికి వైరస్ సోకింది. పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఇటీవల కూడా ఢిల్లీలో 28 వేల దాకా డైలీ కేసులు వచ్చాయి. కానీ ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్లు చాలా తక్కువ” అని మ్యాక్స్‌‌‌‌ హెల్త్ కేర్ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ అవసరం 23.4 శాతంగా ఉందని, ఇది సాధారణమేనని, కానీ ఫస్ట్ వేవ్‌‌‌‌లో 63%, సెకండ్ వేవ్ సమయంలో 74% అవసరం ఉండేదని స్టడీలో తేలింది. కరోనా బారిన పడి చనిపోయినవాళ్లలో ఎక్కువ మంది 2 డోసుల వ్యాక్సిన్ వేస్కోనోళ్లేనని మ్యాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ డైరెక్టర్ సందీప్ బుద్ధిరాజా చెప్పారు.

161 కోట్ల డోసులేసిన్రు

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 161.16 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. దేశంలో 94  శాతం మంది పెద్దలు ఫస్ట్ డోసు వేసుకోగా, 72 శాతం మంది రెండు డోసులు వేసుకున్నట్లు తెలిపింది. శుక్రవారం 58 లక్షల డోసులు వేసినట్లు వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 74 లక్షలకు పైగా ప్రికాషన్ డోసులు వేసినట్లు పేర్కొంది.