అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల పరిధిలో పోలింగ్ జరిగింది. 3,299 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ల దశలోనే 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 33,435 వార్డు సభ్యులకు గాను 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 67,75,226 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా సుమారు 80 శాతం పోలింగ్ నమోదైంది. 13 జిల్లాల్లో మధ్యాహ్నం 2.30వరకు అందిన సమాచారం మేరకు 78.9శాతం పోలింగ్ నమోదు అయింది. నాలుగో దశలో జరిగిన ఎన్నికలకు మొత్తం 28,995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసు బందోబస్తు నిర్వహించారు. దాదాపు 53,282 మంది పోలింగ్ సిబ్బందితో ఎన్నికలు జరిపారు. మధ్యాహ్నం 3 గంటలలోగా పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిల్చున్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల పోలింగ్ కాస్త ఆలస్యంగా ముగిసే పరిస్థితి ఉంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అభ్యంతరాలున్నచోట్ల రీకౌంటింగ్ జరుపుతారు. ఫలితాల ప్రకటన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. మేజర్ పంచాయతీల్లో వేల సంఖ్యలో ఓట్లు ఉన్నందున ఫలితాలన్నీ వెల్లడి కావడానికి అర్ధరాత్రి పొద్దుపోయే వరకు లెక్కింపు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.
For More News..
ఇప్పటికైనా.. ఏపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోండి
కాలేజీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. క్లాస్ రూంలో కాల్పులు