రాజకీయ నాయకులకు రైతు ఎప్పుడూ ఓ క్యాష్ కౌ లాంటివాడే! ఎవరికి రాజకీయ భవిష్యత్తు కావాలన్నా, మెండుగా సొమ్ము చేసుకోవాలన్నా, వాడుకునేది రైతు పేరునే. ఎప్పుడు అరక కట్టనోడు, బురద మడిలో కాలుపెట్టనోడు, మోటబాయి అంటే తెల్వనోడు, రైతు కష్టాలు ఎరగనోడు, వందల, వేల ఎకరాల భూస్వాములందరూ ‘నేను రైతు బిడ్డను’ అని బిల్డప్ ఇచ్చుకుంటారు. ఫామ్‌హౌస్‌లకు, పంట భూములకు తేడా తెల్వనోడు కూడా ‘నేను రైతు’ను అని రాద్ధాంతం చేస్తాడు. ఇక ప్రజల సొత్తుతో ఇచ్చే రైతుబంధు(భూమి బంధు)పై ఎదో కొట్లాడి పానిపట్టు యుద్ధంలో గెలిచినట్లు ఊరూరా డప్పు కొడతారు.
రైతు బంధు కాదు భూమి బంధు?
సీఎం కేసీఆర్‌ను హిట్లర్ మీడియా మంత్రి గోబెల్స్ ఆత్మ పరిపూర్ణంగా ఆవరించింది అనడంలో సందేహం లేదు. హిట్లర్ యూదులను ఊచకోత కోసి, అది వారి మేలుకోసమే చేశానని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. రైతు బంధు ఒక తెలివైన పథకం. పేరు రైతుది, ఫలితం మాత్రం అత్యధిక భూమి ఉన్న భూస్వాములది. మొదట12,000 కోట్లతో మొదలై రూ.15,000 కోట్లకు చేరింది. మొదట 50 లక్షల మంది రైతులకు రైతు బంధు వచ్చేది.. ఇప్పుడు రైతులు అనూహ్యంగా 70 లక్షలకు పెరిగారు. ఎకరాకు రూ. 4 వేలతో మొదలై ఇప్పుడు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. రైతు, వ్యవసాయంతో సంబంధం లేకుండా, సాగు చేసినా, చేయకున్నా, గుట్టలైనా, పుట్టలైనా, రాళ్లైనా, రప్పలైనా సాగుతో సంబంధం లేకుండా కాకులను కొట్టి, గద్దలకు పంచినట్టు, కేసీఆర్కనీసం ఏడాదికి రూ.5 వేల కోట్ల వరకు అప్పనంగా అనర్హులకు దోచిపెడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలు
ఎరువుల సబ్సిడీ: 2014 ముందు ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్ బాగా ఉండేది. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత వేప పూత యూరియా, డీఏపీ ఎరువుల కొరత లేకుండా అందించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా యూరియా ఒక బస్తా రూ.266 (ఉత్పత్తి ధర రూ. 2000), డీఏపీ బస్తా రూ.1127( రూ.2000 సబ్సిడీ) కి అందిస్తున్నారు. అంటే ఒక ఎకరానికి, ఒక పంటకు దాదాపు రూ. 6000 సబ్సిడీ ఇస్తున్నారు. ఇదీగాక కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రాష్ట్రంలోని ఒక్కో రైతుకు రూ.6000 సాయం చేస్తున్నారు.
ధాన్యం మద్దతు ధర: కేంద్రం క్వింటాలుకు రూ. 2040 చెల్లిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నది. సగటున ఒక ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం వస్తే , రూ.51,000 ఖర్చు పెట్టి కొని, దాన్ని బియ్యంగా చేస్తే వచ్చే 1700 కిలోల బియ్యంను కిలోకూ.రూ. 30కి కొని ప్రజలకు( రాష్ట్ర ప్రభుత్వానికి)రూ. 3కు ఇస్తున్నది. అంటే ఎకరాకు కనీసం 30,000 రూపాయలు ఒక పంటకు కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది.
ప్రధాన మంత్రి పంటల బీమా: పంట నష్టం జరిగినప్పుడు రైతులు నష్ట పోకుండా పంట బీమా వల్ల దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్రం చెల్లించింది. రైతు కేవలం1.5% ప్రీమియం చెల్లించాలి, మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 పద్ధతిలో భరించాలి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం చెల్లించడం ఇష్టం లేక చేతులు దులుపుకుంది. పంటల బీమాలో కూడా సగటున ఎకరాకు ప్రధాని మోడీ రూ.2 వేలు ఇస్తున్నారు.
రైతు వడ్డీ సబ్సిడీ స్కీం: వ్యవసాయానికి షార్ట్ టర్మ్ లోన్స్ మీద 5 నుంచి-7 శాతం వడ్డీ సబ్సిడీ కోసం కేంద్రం ఏటా దాదాపు రూ19,800 కోట్లు ఖర్చు పెడుతున్నది. దీర్ఘకాలిక వ్యవసాయ లోన్లు తీసుకుంటే రూ. 2 కోట్ల వరకు , 7 సంవత్సరాల దాకా 3 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తున్నది.
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్: దేశంలో పశు సంపద పెంచడానికి ఏడాదికి రూ. 9,800 కోట్లతో , ఒక్కో యూనిట్ గొర్లు, మేకల ఫామ్ కు రూ.50 లక్షలు, ఫౌల్ట్రీకి రూ. 25 లక్షలు, పందుల ఫామ్‌కు రూ. 30 లక్షలు, మేత యూనిట్లకు రూ. 50 లక్షల సబ్సిడీతో ఏర్పాటుకు కేంద్ర కృషి చేస్తున్నది.
సాయిల్ హెల్త్ కార్డు: భూమి సాంద్రత, పోషక పదార్థాలు, పంట అనుకూలత వీటన్నిటికీ ఉపయోగపడేలా సాయిల్హెల్త్ కార్డులు ఇస్తున్నది. ఆయిల్ పామ్: దేశంలో వంట నూనె దిగుమతి తగ్గించటానికి పామ్ ఆయిల్ కు ఎకరాకు రూ. 36,000 సబ్సిడీ ఇస్తున్నది. అంతర పంటలకు ఒక్కో హెక్టార్ కు రూ. 50 వేల సబ్సిడీ ఇస్తున్నది.
రైతు రుణాలు: రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా నిరుడు రూ.14.6 లక్షల కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా కేంద్రం ఇప్పించింది. అందులో 4 శాతం, సకాలంలో అప్పు కడితే 7 శాతం వడ్డీ కేంద్రమే భరిస్తున్నది. ఇలా ఏడాదికి 20 వేల నుంచి- 30 వేల కోట్ల ఖర్చు కేంద్రమే భరిస్తున్నది.
వ్యవసాయ ఇన్ఫ్రా ఫండ్: 2022లో కేంద్రం రూ.13,681 కోట్లతో గోదాములు, శీతల కేంద్రాలు, ఇతర వసతుల కోసం కేటాయించింది. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్స్: రైతులు వ్యాపార వేత్తలు కావాలనే ఉద్దేశంతో రూ.6,865 కోట్లతో కేంద్రం10 వేల ఎఫ్‌పీవో సంస్థలను ఏర్పాటు చేసింది. సేంద్రియ వ్యవసాయ యోజన: ఉత్పత్తి పెంచడానికి, మార్కెటింగ్ తదితర అనువైన అన్ని అంశాల్లో కేంద్రం తోడ్పాటునందిస్తున్నది.
జాతీయ తేనెటీగల, తేనె మిషన్: రూ.110 కోట్లు తేనె రైతుల సహాయానికి కేంద్రం వెచ్చిస్తున్నది. వ్యవసాయ యాంత్రీకరణ: గత 8 ఏండ్లలో రూ. 5,490 కోట్లతో 14 లక్షల వ్యవసాయ యంత్రాలకు కేంద్రం సబ్సిడీ అందించింది. డ్రోన్ల కొనుగోలు కోసం 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది.
కిసాన్ రైళ్లు: రైతుల ఉత్పత్తుల రవాణా కోసం167 రూట్లలో కేంద్రం 2,359 రైళ్లను నడుపుతున్నది.
క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం: హార్టికల్చర్ వ్యవసాయ మండల్ ఏర్పాటు చేసి, దానికి సంబంధించి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నది. వ్యవసాయాన్ని పారిశ్రామీకరించే దిశగా రూ.63.67 కోట్లతో అగ్రి బిజినెస్ఇంక్యూబేటర్స్, స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు : 2022 దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది కేంద్ర విధానాలకు సూచిక. ఎకరాకు ఏడాదికి రూ.60 వేలు ఇస్తున్న కేంద్రం కేసీఆర్ అమలు చేస్తున్న భూమి బంధు, రైతుకు, వ్యవసాయానికి, కౌలు రైతుకు సంబంధం లేకుండా, భూమి ఉన్న ప్రతి భూ యజమానికి లబ్ధి చేకూరుస్తున్నది. ఎకరాకు ఏడాదికి కేవలం రూ. 10 వేల చొప్పున ఏడాదికి రూ.14 వేల కోట్ల వరకు ఖర్చుపెడితే, అందులో కనీసం రూ. 5000 కోట్లు అనర్హులకు చేరుతున్నది. ప్రధాని మోడీ అమలు చేస్తున్న రైతు పథకాలు, అన్ని సబ్సిడీలను కలుపుకుంటే ఎకరాకు ఏడాదికి తక్కువలో తక్కువ దాదాపు రూ.60 వేల వరకు ఉంటున్నది. ఈ మొత్తం కేవలం వ్యవసాయం చేసే రైతుకు, కౌలు రైతుకు ఉపయోగపడుతున్నది. ఈ రోజు ఎరువుల కొరత లేదు, గోదాములు ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు విరివిగా పెరుగుతున్నాయంటే అందుకు మోడీ రైతు సంక్షేమ విధానాలే కారణం. రైతుల పేరు చెప్పి ప్రాజెక్టుల పేరుమీద వేల కోట్ల దండుకోవడం, మోడీ అమలు చేసే ఉచిత బియ్యం రీసైక్లింగ్ చేయించి వేల కోట్లు గాదె కింద పందికొక్కుల్లా మెక్కడం ఇక్కడి నేతలకు అలవాటుగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ స్థానంలో ఇంకో ముఖ్య మంత్రి, అదీ బీజేపీ ముఖ్యమంత్రి ఉండి ఉంటే వ్యవసాయంలో సమగ్ర( వ్యవసాయం, సూక్ష్మ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, మత్స్య సంపద, అమూల్ లాంటి పాల సంస్థలు, ఫార్మర్ ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పశు సంపద, హార్టీ కల్చర్, విదేశీ వ్యవసాయం) అభివృద్ధి జరిగి ఉండేది. ఎన్నికల కోసం కాకుండా ఈ దేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా మోడీ ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకొని అమలవుతున్నాయి.
భూమి బంధు – కొన్ని నిజాలు
- తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది రైతులు(భూ యజమానులతో కలిసి) ఉన్నారు. అందులో 35 లక్షల మందికి సగటున ఒక ఎకరం(3500 కోట్లు) ఉన్నది.13 లక్షలు మంది రైతులకు సగటున 2 (2–5)ఎకరాల భూమి ఉన్నది. 45 లక్షల ఎకరాల భూమికి రైతుబంధు కింద రూ.4500 కోట్లు అందితే, కేవలం 7 లక్షల మందికి(70 లక్షల ఎకరాలు) రూ.7 వేల కోట్లు దక్కుతున్నాయి.
- మొదట 50 లక్షలు ఉన్న భూ యజమానులు ఇప్పుడు 70 లక్షలు అయ్యారు. కారణం వందలు, వేల ఎకరాలు ఉన్న వారు తెలివిగా వారి భూమిని ఇంట్లో కుటుంబ సభ్యుల పేరుమీద తక్కువ చూపెట్టడానికి డివైడ్ చేసుకుంటున్నారు.
- ఏటా భూమి బంధు పేరు మీద ఖర్చు పెట్టే రూ.15,000 కోట్లలో రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల వరకు భూస్వాములకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయనాయకులకు, ఉన్నతాధికారులకు, రియల్ ఎస్టేట్ ఓనర్లకు దక్కుతున్నాయి.
- రాష్ట్రంలో వ్యవసాయం చేసే వారిలో 35.6 శాతం కౌలు రైతులు ఉంటే, అందులో 69 శాతం మంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో రైతు బీమా పేరిట దాదాపు 35 లక్షల మంది రైతులకు 5 లక్షల బీమా చేస్తే, ఒక గుంట భూమి లేని3 కోట్ల మందికి ఒక్క రూపాయి బీమా లేదు. కేసీఆర్ పాలసీల వల్ల తెలంగాణ రైతుది ఆదాయంలో 25 ర్యాంకు, అప్పుల్లో 5 ర్యాంకు. రోజుకు రైతుకు దక్కేది రూ. 313 రూపాయలు మాత్రమే. కానీ సగటున ఒక్కో రైతు అప్పు మాత్రం రూ.1.53 లక్షలు. అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోతే రైతులను ఆదుకునే పంట బీమాకు కేసీఆర్మంగళం పాడారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ స్వాహా, ఆర్గానిక్ వ్యవసాయానికి నిరాదరణ, సమీకృత వ్యవసాయానికి ప్రోత్సాహం సున్నా. పాల ఉత్పత్తుల ప్రోత్సాహం గుండు సున్నా. రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తుల సంఘాలకు నిరాదరణ.
- డా. బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ, భువనగిరి