
- ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో రూ.లక్షన్నర, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు
- రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు
- గత ఏడేండ్లలో అర్బన్‌లో 1.55 లక్షల ఇండ్ల కోసం కేంద్రం ఇచ్చింది రూ.1200 కోట్లే!
- ఈ మొత్తంతో కనీసం 15 వేల ఇండ్లూ కట్టలేని పరిస్థితి
- 2016లో రూరల్‌కు రూ.192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కి
- తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు:‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గరిష్టంగా పట్టణాల్లో రూ.లక్షన్నర, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున కేంద్రం ఇస్తున్నది. కానీ, గత బీఆర్ఎస్ సర్కారు ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి పట్టణాల్లో సగటున రూ.8 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 లక్షలు వెచ్చించింది. ఈ లెక్కన గడిచిన ఎనిమిదేండ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1,200 కోట్లతో 15 వేల ఇండ్లు పూర్తయ్యేవి. కానీ గత సర్కారు ఆ నిధులను ఇతర స్కీమ్‌లకు మళ్లించడంతో ఆమాత్రం ఇండ్లు కూడా కట్టలేకపోయింది. తాజాగా.. 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కోరడంతో ఎన్ని ఇండ్లు మంజూరవుతాయనే ఉత్కంఠ నెలకొన్నది.
అర్బన్‌లో సై.. రూరల్‌కు నై!
బీఆర్ఎస్ హయాంలో పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు 1.55 లక్షల ఇండ్లను కేంద్రం కేటాయించింది. వీటికి రూ.2,200 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉండగా, కేవలం రూ. 1,200 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. కాగా, ఒక్కో ఇంటికి రూ.8 లక్షల చొప్పున లెక్క వేస్తే ఈ నిధులతో15 వేల ఇండ్లు నిర్మించే అవకాశమున్నా నాటి బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల సాధ్యం కాలేదు.
నిధులను ఇతర స్కీమ్స్‌కు మళ్లించడం వల్ల లక్ష్యం చేరలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 192 కోట్లు సాంక్షన్ చేయగా, అంత తక్కువ మొత్తం తమకు అవసరం లేదంటూ గత ప్రభుత్వం 2022 లో కేంద్రానికి వెనక్కి పంపినట్టు అధికారులు గుర్తుచేస్తున్నారు. మొత్తం మీద కేంద్రం నిధులతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ సర్కారు రూ. 22 వేల కోట్లతో డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇండ్లు, మిగతా ఏరియాల్లో లక్షా 72 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టగా.. పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు.
పీఎం ఆవాస్ గైడ్ లైన్స్ తోనూ సమస్యే..
పీఎం ఆవాస్ యోజన ద్వారా అర్బన్ ఏరియాల్లో రూ.1.50 లక్షల సహాయాన్ని మూడు దశల్లో ( రెండు సార్లు రూ. 60వేల చొప్పున, ఒకసారి రూ. 30 వేలు ) ఇస్తుందని, రూరల్ లో మాత్రం పీఎం అవాస్ గైడ్ లైన్స్ కఠినంగా ఉండటంతో ఇండ్లు రాలేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నరతో అటు అర్బన్ ప్రాంతంలో, రూ.72వేలతో ఇటు రూరల్ ఏరియాలో ఇంటి నిర్మాణం ఎలాగూ సాధ్యం కాదు. దీంతో కనీసం రాష్ట్రంలో అమలు చేస్తున్న స్కీమ్‌కు ఆ మొత్తాన్ని వాడుకునేందుకు గతంలో నిబంధనలు ఒప్పుకోలేదు. పీఎం ఆవాస్‌యోజన కింద ముందుగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆ లిస్టులను కేంద్రానికి పంపిస్తే 3 దశల్లో కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. కానీ గత సర్కారు అమలుచేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీమ్ నిబంధనలు ఇందుకు పూర్తి విరుద్ధం. కాంట్రాక్టర్లు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. కొన్నిచోట్ల ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. దీంతో గత ఎనిమిదేండ్లుగా పీఎం ఆవాస్యోజనాను రాష్ట్రం పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయింది.
ఈసారి గైడ్‌లైన్స్ మార్చిన రాష్ట్ర సర్కారు..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద నియోజకవర్గానికి 3,500 చొప్పున 4 లక్షల 50 వేల ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. తొలిదఫా సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని పేర్కొన్నది. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అప్లికేషన్లు తీసుకున్నది. కాగా పెద్దసంఖ్యలో ఇండ్లు నిర్మిస్తున్నందున గత ప్రభుత్వానికి భిన్నంగా పీఎం అవాస్ స్కీమ్ ను ఉపయోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు నిబంధనలు అడ్డుగా ఉండడంతో వాటిని మారుస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందుకే గతానికి భిన్నంగా ఈసారి ఇందిరమ్మ ఇండ్ల కు ముందుగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. ఇవే లిస్టులను కేంద్రానికి పంపి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం నుంచి అర్బన్‌లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, రూరల్ లో రూ. 72 వేలు కేంద్రం నుంచి వస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కాగా, ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోగా, ఆఫీసర్లు వీటిని మొదట 65 లక్షలకు కుదించారు. తాజాగా.. ఆ అప్లికేషన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వెరిఫికేషన్సర్వే నిర్వహించి, వీరిలో 30 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇండ్లు లేవని తేల్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 72 వేల మందికి ఇంటి మంజూరు పత్రాలు జారీ చేశారు.
20 లక్షల ఇండ్లు ఇవ్వండి..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశ పట్టణ జనాభాలో 8 శాతం ప్రజలు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ఖట్టర్ నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో సీఎం, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి.. ఇండ్లు కేటాయించాలని కోరారు. పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇండ్ల నిర్మాణానికి సమగ్రమైన డేటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నందున.. రాష్ట్రానికి 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. దీంతోపాటు పీఎం అవాస్ స్కీమ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పలు మీటింగ్ కు హౌసింగ్ ఉన్నతాధికారులు అటెండ్ అయి.. రాష్ట్ర ప్రతిపాదనలను అందజేశారు.